మాస్కుల కోసం ఎగబడొద్దు

16 Mar, 2020 04:14 IST|Sakshi

జేబు రుమాలును వాడినా సరిపోతుంది: ఈటల

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ సోకినంత మాత్రాన ప్రాణం పోతుందన్న భయం అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇది సోకినవారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సిన అసవరం ఉంటుందని, 95 శాతం మంది తమంతట తాముగా గాని, సాధారణ చికిత్సతోపాటు కోలుకుంటారని తెలిపారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆదివారం రాత్రి ఆయన మరోసారి శాసనసభలో కోవిడ్‌పై ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, విదేశాల నుంచి వచ్చిన వారికి తప్ప స్థానికంగా ఉన్న ఎవరికీ ఇప్పటి వరకు వైరస్‌ సోకలేదని చెప్పారు. ప్రస్తుతం గాంధీలో ఇద్దరు మాత్రమే వైరస్‌ సోకి చికిత్స పొందుతున్నారన్నారు. వికారాబాద్‌ అనంతగిరిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌ వల్ల ఎవరికీ ఏమాత్రం ఇబ్బంది ఉండదని, విదేశాల నుంచి వచ్చినవారిలో అందులో కేవలం అబ్జర్వేషన్‌ కోసం 14 రోజులు ఉంచుతామని తెలిపారు. ఇక మాస్కుల కోసం ఎవరూ ఎగబడవద్దని, వైరస్‌ సోకిన వారు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు మాత్రమే ప్రస్తుతం వాటి అవసరం ఉందని, ఈ విషయంలో మాస్కులకు ఎలాంటి కొరతలేదని ఈటల స్పష్టంచేశారు. మిగతావారు ముందుజాగ్రత్త చర్యగా జేబు రుమాలు, చీరకొంగు, తలపాగాను వాడినా సరిపోతుందన్నారు.

ఈఎస్‌ఐ సంక్షోభంతో మందుల కొరత: మంత్రి మల్లారెడ్డి 
రాష్ట్రంలో ఈఎస్‌ఐ సంక్షోభం వల్ల కొన్ని మందులకు కొరత ఏర్పడిన మాట నిజమేనని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అంగీకరించారు. అయితే దాన్ని అధిగమించామని ఇప్పుడు మందులకు కొరతేలేదన్నారు.  

>
మరిన్ని వార్తలు