ఓటు విలువ తెలుసుకో! 

11 Apr, 2019 13:21 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ : వందశాతం పోలింగ్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎంత కసరత్తు చేస్తున్నా ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఓటర్లు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడంతో ఎన్నికల సంఘం ఆశించిన ఫలితాలు రావడం లేదు. పోలింగ్‌ శాతాన్ని పెంచడం కోసం కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఓటుహక్కుపై సదస్సులు, సమావేశాలు నిర్వహించారు.

ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చాటుతూ ఊరూరా ర్యాలీలు తీశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రచార వాహనాలతో స్థానిక భాషల్లో మైక్‌ల ద్వారా ప్రచారం చేయించారు. అయినా ఇంకా లక్షలాది మంది పోలింగ్‌ బూత్‌లవైపు తొంగి చూడడం లేదు. గతతో పోలిస్తే పోలింగ్‌ శాతం కొంతమేర పెరిగినా ఇంకా చాలా మంది ఓటు వేయడంపై నిరాసక్తతతో ఉండడం ఆందోళన కల్గిస్తోంది. గ్రామీణ ఓటర్లకంటే పట్టణ ఓటర్లే తమహక్కు వినియోగంపై అలసత్వం వహిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు మినహా సాధారణ ఎన్నికల్లో పోలింగ్‌ 75 శాతం మించడం లేదు. 

నిర్లిప్తతను వీడాలి 
ఐదేళ్లకోసారి ఒక్కగంట కేటాయిస్తే చాలు.. తమ తలరాతలు మార్చే ప్రతినిధిని ఎన్నుకోవచ్చన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించాలి. ఓటేసినప్పుడే ప్రజాప్రతినిధిని ప్రభుత్వాన్ని నిగ్గదీసి, నిలదీసే హక్కు ఉంటుందని తెలుసుకోవాలి. ఒకవేళ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్‌ నొక్కినా ఓటు హక్కు వినియోగించుకున్నట్లే.. ‘నేను ఒక్కడినే ఓటేయకపోతే మన తలరాతలు మారవు కదా? అన్న నిర్లిప్తతను వీడాలి.

ఓటర్లును తరళించే బాధ్యత ఈసీ తీసుకోవాలి. ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చెబుతూ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఓటర్‌ను పోలింగ్‌ కేంద్రానికి రప్పించడమే అసలైన పని. వాహన సదుపాయం కల్పించి బూత్‌లకు రప్పించడంలో రాజకీయ పార్టీలే ఇప్పటికీ క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలా వాహనాలు ఏర్పాటు చేయడంపై ఆంక్షలు విధించిన, ఎన్నికల కమిషన్‌ వికలాంగులు, వయో వృద్ధు, అశక్తులను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడానికి ఒక ఆటోను ఏర్పాటు చేస్తోంది.

జిల్లాలోని మారుమూల గ్రామాలు, అనుబంధ తండాల్లో, వాగులు, వంకలు దాటి బూత్‌లకు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి చోట్ల సరైన వాహన సదుపాయం కల్పించే బాధ్యతను ఎన్నికల కమిషన్‌ తీసుకోవాలి. పోలింగ్‌ రోజుతో పాటు ముందురోజు, మర్నాడుకూడా ప్రభుత్వ పరంగా సెలవు ప్రకటిస్తే దూరప్రాంతాల్లో ఉండే ఓటర్లు స్వస్థలాలకు వచ్చి ఓటేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు