మళ్లింపు జలాలపై నిపుణుల కమిటీ?

14 Mar, 2019 02:37 IST|Sakshi

కృష్ణా, గోదావరి బోర్డుల భేటీలో వెల్లడించిన కేంద్ర జల వనరుల శాఖ 

వర్కింగ్‌ మాన్యువల్‌కు రాష్ట్రాలను ఒప్పించాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశాన్ని తేల్చేందుకు మళ్లీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి కమిటీయే మార్గమని తేల్చింది. ఇదివరకే ఏర్పాటు చేసిన ఏకే బజాజ్‌ కమిటీ ఏమీ తేల్చని నేపథ్యంలో కేంద్ర జల సంఘంలో పనిచేసిన రిటైర్డ్‌ ఇంజనీర్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన నిపుణులతో కమిటీని నియమించి దీనిపై నిర్దిష్ట సమయంలోనే నివేదిక ఇచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలిస్తున్న దృష్ట్యా, బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డుల మేరకు కృష్ణాలో ఎగువన ఉన్న తెలంగాణ అదనపు నీటి వాటాను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే. ఏకే బజాజ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ 2017 ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటించిన కమిటీకి ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని రాష్ట్రం కోరింది. మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని కమిటీ చేతులెత్తేసింది.

ఈ సమయంలోనే కమిటీ గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ వ్యవధిలో రాష్ట్రంలో ఒక్క పర్యటన కూడా కమిటీ చేయలేదు. ఈ నేపథ్యంలో కమిటీ రద్దయిపోయింది. అప్పటి నుంచి ఈ అంశం మరుగునపడింది. అయితే ఇటీవల మళ్లీ ఈ అంశాన్ని తెలంగాణ తెరపైకి తేవడంతో కేంద్రం దీనిపై చర్చించేందుకు బుధవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను ఢిల్లీకి పిలిపించింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌ సింగ్‌ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తిభవన్‌లో జరిగిన ఈ భేటీకి కృష్ణాబోర్డు ఇన్‌చార్జి చైర్మన్, గోదావరి బోర్డు చైర్మన్‌ ఆర్‌కే జైన్, కృష్ణాబోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనాలు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మళ్లింపు జలాలపై ఇరు రాష్ట్రాలు వెల్లడిస్తున్న అభిప్రాయాలపై చర్చించారు. దీనిపై తేల్చేందుకు నిపుణుల కమిటీని వేద్దామని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ప్రతిపాదించగా, బోర్డు చైర్మన్‌ అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పాటే కృష్ణా, గోదావరి బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్‌ను ఓకే చేసేలా రెండు రాష్ట్రాలను ఒప్పించాలని కేంద్రం బోర్డులకు సూచించినట్లుగా తెలిసింది. దీన్ని అంగీకరించాకే రెండు రాష్ట్రాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే అంశమై చర్చిద్దామని తెలిపినట్లుగా సమాచారం. ఇక కృష్ణా బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలిసింది.  

మరిన్ని వార్తలు