విత్తన కంపెనీల ప్రచార హోరు 

4 Jun, 2019 10:08 IST|Sakshi

బేల(ఆదిలాబాద్‌): ఖరీఫ్‌ సీజన్‌ సమీపించిన తరుణంలో పత్తి విత్తన కంపనీలు ఊదరగొడుతున్నాయి. ప్రచార రథాలు, మైక్‌సెట్‌లు, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్లెక్సీలు, కటౌట్‌లతో హోరెత్తిస్తున్నాయి. ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్నిగ్రామాల్లో ప్రచారం చేపడుతూ రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద రైతులను సమీకరించి సమావేశాలు పెడుతూ ఊదరగొడుతున్నారు. అధిక దిగుబడి  వస్తుందంటూ నమ్మబలుకుతూ బుట్టలో వేసుకుంటున్నారు.

కొందరు దళారులు నకిలీ, నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ బీటీ పత్తి విత్తనాలను సరఫరా చేసే కొన్ని సంస్థలు వందల రకాలను మార్కెట్‌లో ఇప్పటికే సంసిద్ధం చేశాయి. రైతులు అప్రమత్తంగా ఉండకపోతే పంటలు నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. నాణ్యమైన పత్తి బీటీ విత్తనం 450 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ.730కు లభిస్తుండగా నకిలీ విత్తనాల ప్యాకెట్‌ రూ.400నుంచి రూ.600 వరకు విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొందరు డిస్ట్రిబ్యూటర్‌లు, డీలర్లకు పలు కంపనీలు విదేశీ, విహార యాత్రలకు అవకాశం కల్పిస్తూ అధిక మొత్తంగా విత్తనాలు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు నకిలీ విత్తనాలపై నిఘా వేసి, పూర్తిస్థాయిలో అరికట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 1,46,960 హెక్టార్లలో.. 
జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి భూములున్నాయి. దీంతో ప్రధాన పంటగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,46,960 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది వర్షభావ పరిస్థితులు ఉండడంతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఎక్కువ భూముల్లో నీటి సౌకర్యం లేకపోవడం, వర్షాధారంతో కూడా అధికంగా పత్తి పంట సాగు చేసే వీలుండటంతోనే కొన్నేళ్ల నుంచి పత్తిపంటపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
 
కృత్రిమ కొరత ఇలా.
తొలకరి చినుకులు మొదలైతే రైతులు విత్తనాలకోసం విత్తన విక్రయకేంద్రాల ఎదుట బారులు తీరుతారు. ఇదే అదనుగా భావించి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు. ఇదే సమయంలో కొత్త రకం విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు అంటగడుతుంటారు. కొన్నేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

అప్పు రుపేణా.. 
జిల్లాలో కొంతమంది దళారులు రైతులకు అప్పు రూపేణా విత్తనాలు అందిస్తుంటారు. ఇలాంటి సమయంలో నకిలీ విత్తనాలు అంటగడుతుంటారు. వారు ఇచ్చే విత్తనాలు తీసుకోవడమే గానీ, కావాలనుకున్న కంపనీల విత్తనాలు ఇవ్వరు. పంట పండినా, పండకపోయినా పంట దిగుబడి వచ్చే సమయంలో ఇచ్చిన సరుకుకు వడ్డీతో సహా ఇవ్వాల్సిందే.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  • ∙నకిలీ విత్తనాలను గుర్తించేందుకు వాటిని తయారు చేసిన కంపనీ పేరు, లోగో, బ్యాచ్, లాట్‌ నంబర్, తయారు చేసిన తేదీ, వాడకానికి గరిష్ఠ గడువు వంటివి ఖచ్చితంగా పరిశీలించాలి. 
  • ∙గుర్తింపు పొందిన డీలర్ల నుంచే కొనుగోలు చేయాలి. 
  • ∙ఐఎస్‌ఓ స్టీక్కర్‌ ఉందో లేదో గమనించాలి. 
  • ∙జెర్మినేషన్‌(మొలకెత్తే శాతం) వివరాలు చూడాలి. 
  • ∙ఎలాంటి అనుమానాలున్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. 
మరిన్ని వార్తలు