కరెంట్ కష్టాలు

23 Aug, 2014 02:50 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : విద్యుత్ కోతలు అన్నదాతలను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. వ్యవసాయానికి కనీసం రెండు గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో ఆవేదనతో రోడ్డెక్కుతున్నారు. ఎడాపెడా విద్యుత్ కోతల కారణంగా జిల్లాలో రైతుల ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజూ నాలుగైదు మండలాల్లో సబ్‌స్టేషన్ల ముట్టడీలు జరుగుతున్నాయి. పలుచోట్ల రాస్తారోకోలు చేస్తున్నారు.

విద్యుత్ కోతలను నిరసిస్తూ అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం లోకేశ్వరం, కడెం, ఖానాపూర్, కుంటాల తదితర మండలాల్లో అన్నదాతలు ఆందోళనలు నిర్వహించారు. ఖరీఫ్ కాలం దాటి పోతుం డటం, వర్షాలు లేకపోవడంతో రైతులు బోర్లు, వ్యవసాయ బావుల్లో ఉన్న నీటితో పంటలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయానికి ఐదు గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రెండు గంటలు కూడా సరఫరా కావడం లేదని రైతులు వాపోతున్నారు. సరఫరా అయ్యే ఆ కాస్త సమయంలో పలుమార్లు ట్రిప్ అవుతుండటంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా మోటార్లు కాలిపోయి అదనపు భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 డిమాండ్ సరఫరాల్లో వ్యత్యాసం
 జిల్లాలో 89 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ట్రాన్స్‌కో జిల్లాకు ఆగస్టులో ప్రతిరోజు 3.878 మిలియన్ యూనిట్లు కోటా నిర్ణయించారు. కానీ రోజుకు 4.439 మిలియన్ యూనిట్ల విద్యుత్ విని యోగం అవుతోందని ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ కోత విధించాల్సి వస్తోందని అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన గృహ విద్యుత్ వినియోగానికి తోడు వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా పెరగడంతో కోతలు అనివార్యమవుతున్నాయని చెబుతున్నారు.

 వరి హరీ..
 ఏటా ఖరీఫ్‌లో జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ సారి వర్షాభావం, విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో వరి విస్తీర్ణం 27 వేలకు పరిమితమైంది. ఇప్పటివరకు జిల్లాలో 13.42 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను వేసుకున్నారు. సుమారు 8.27 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, 2.77 లక్షల ఎకరాల్లో సోయాబీన్‌ను విత్తుకున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో నారు పోసుకున్న రైతులు కూడా నాట్లు వేసుకునేందుకు జంకుతున్నారు.

మరిన్ని వార్తలు