రబీకి  సన్నద్ధం..

4 Oct, 2018 10:46 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి: ఖరీఫ్‌ సీజన్‌ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో రబీ కోసం వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికలను సిద్ధం చేసింది. జిల్లాలో రైతులు సాగు చేయనున్న పంటలకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులకు సంబంధించిన అంచనాలను తయారుచేసింది. మామూలుగా అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు రబీ సీజన్‌ ఉంటే జిల్లాలో ఒక నెల ఆలస్యంగా పంటల సాగు ప్రారంభిస్తుంటారు. జిల్లా పరిధిలోని 20 మండలాల్లో సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తనాలను పంపిణీ చేయడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో ఈ రబీలో దాదాపు 80,711.4 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సింహభాగం 51,975 ఎకరాల్లో వరి వేయనున్నట్లు పేర్కొం టోంది. 2017–18 సంవత్సరం రబీలో 76,865 ఎకరాల్లో పంటలు సాగయినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఇది ఎక్కువే. జిల్లాలో రబీ సాధారణ సాగు 86,092.5 ఎకరాలు. వ్యవసాయ శాఖ దాదాపు 6,000 ఎకరాలు తక్కువగా అంచ నా వేసింది. పంటలకు అవసరమయ్యే 5,662 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయబోతోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులను అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు.

చెరువుల కింద ఇబ్బంది లేదు..
జిల్లాలో ఈ సారి వర్షాలు విస్తారంగా కురియడంతో చెరువులు దాదాపు నిండాయి. దీంతో ఆయకట్టులో భూముల్లో సాగుకు ఇబ్బంది లేదు. జిల్లాలో ప్రధాన చెరువలైన రామప్ప, లక్నవరం, గణపురం, భీంగణపూర్‌ చెరువులతోపాటు చిన్న చితకా కలిపి 600లకుపైగా చెరువులు ఉన్నాయి. దాదాపు అన్ని చెరువులు నీటితో నిండి ఉన్నాయి.

సాగు అంచనాలను మించే అవకాశం..
ఖరీఫ్‌ ప్రారంభమైన తర్వాత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వాగులు వంకలు ఉన్న ప్రాంతాల్లో ఇసుకమేటలతో పంటలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇలాంటి చోట్ల వ్యవసాయదారులు ఇసుక మేటలను తీయించే పనిలో ఉన్నారు. ఖరీఫ్‌లో సాగుచేయని వారు రబీలో ఆరుతడి పంటలతోపాటు వరి సాగు చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈసారి సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ అంచనాలను మించే అవకాశం ఉంది. వ్యవసాయ బోర్లు ఉన్న చోట వరికి ప్రాధాన్యతనిస్తుండగా, నీటి సదుపాయం లేనిచోట రైతులు పప్పుధాన్యాలను సాగు చేయనున్నారు.

మరిన్ని వార్తలు