రైతులపై నీటి తీరువా ‘పిడుగు’

22 Jun, 2015 02:23 IST|Sakshi
రైతులపై నీటి తీరువా ‘పిడుగు’

పెంపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
* త్వరలో ఉత్తర్వులు జారీ
* రూ.631.56 కోట్ల ఆదాయం లక్ష్యం

సాక్షి, హైదరాబాద్:  రైతులపై నీటి తీరువా రూపంలో పిడుగు పడనుంది. వారి నుంచి భా రీస్థాయిలో నీటి తీరువా వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలు 1996 సంవత్సరంలో నిర్ణయించినవని, ఈ నేపథ్యంలో వాటిని రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈమేరకు సీసీఎల్‌ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనికి ఆర్థిక శాఖ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. పెంపుదల ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి రానుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండంకెల వృద్ధి సాధనలో భాగంగా మద్యం ఆదాయంతో పాటు నీటి తీరువా ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నీటి తీరువా ద్వారా రూ.86.08 కోట్ల ఆదాయం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.631.56 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించారు.

ధరలను రెట్టింపు చేయడంతో పాటు వసూలు పరిధిని పెంచడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్జించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1996లో చంద్రబా బు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నీటి తీరువాను పెంచారు. ఇప్పుడు మళ్లీ ఆయన హయాంలోనే పెంపునకు రంగం సిద్ధమైందని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో రైతులు నీటి తీరువా కింద ఎకరానికి బస్తా ధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దా నిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కు తగ్గారు.ప్రాజెక్టుల కింద రైతులకు సాగునీటిని ఇస్తున్నందున అందుకయ్యే నిర్వహణ వ్యయం మొత్తాన్ని నీటి తీరువా రూపంలో రాబట్టాలనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉందని సాగునీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు కేటగిరీలుగా వసూలు చేస్తున్నారు. ఒకటవ కేటగిరీలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఎకరానికి ఇంత అని వసూలు చేస్తున్నారు. రెండో కేటగి రీలో ఇతర ప్రభుత్వ ఇరిగేషన్ వనరుల కింద ఐదు నెలలు ఆపైన నీటి సరఫరా చేసే భూముల నుంచి వసూలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు