పండుగ ముందు విషాదం

18 Mar, 2018 03:32 IST|Sakshi
శివ, నవదీప్, రాకేశ్, సంతోష్‌(ఫైల్‌)

నీటిగుంతలో పడి ఐదుగురు చిన్నారుల మృతి 

నల్లగొండ జిల్లాలో ఘటన

దేవరకొండ: ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం తీసిన గుంత ఐదుగురు చిన్నారుల ప్రాణాలు బలితీసుకుంది. చిన్న గుంతనే.. అనుకున్న 8 ఏళ్లలోపు చిన్నారులు ఈత కొట్టేందుకు అందులోకి దిగడంతో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల పంచాయతీ పరిధిలోని గుడితండాలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. గుడితండాకు చెందిన నేనావత్‌ ఓంకారం, సరస్వతి దంపతుల ఇద్దరు కుమారులు సంతోష్‌(7), రాకేష్‌(5), అదే తండాకు చెందిన నేనావత్‌ హన్మా, కుమారి దంపతుల ఇద్దరు కుమారులు నవదీప్‌ (6), సాత్విక్‌ (7), సర్దార్‌ అనే వ్యక్తి కుమారుడు శివ ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్ననికే ఇంటికి వచ్చారు.

భోజనం చేశాక పెండ్లిపాకల ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో బండ్‌ నిర్మాణం కోసం తీసిన గుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాదు. ఓ వైపు మూడు, మరో వైపు ఏడెనిమిది అడుగులలోతు ఉన్న ఆ గుంత లో దిగాక నీట మునిగి ఊపిరాడక ఐదుగురూ మృత్యువాతపడ్డారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవర కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోష్, కొండమల్లేపల్లిలోని గౌతమి పాఠశాలలో 2వ తరగతి, రాకేష్‌ ఎల్‌కేజీ చదువుతున్నాడు. నవదీప్‌ కొండమల్లేపల్లిలోని విజయ మేరి స్కూల్‌లో ఫస్ట్‌ క్లాస్, సాత్విక్‌ కూడా అదే పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నారు. మరో చిన్నారి శివ గౌతమి పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు.  

కొడుకులనూ బలితీసుకుంది.. 
‘‘పెండ్లిపాకల ప్రాజెక్టు కోసం కూడుపెట్టే పొలాన్ని ఇచ్చేశాం... సర్వస్వం పోయి కూలి పనులు చేసి బతుకుతున్నాం... ఇప్పుడదే ప్రాజెక్టు మా పిల్లలనూ బలితీసుకుంది. ఉన్న పొలం.., కన్న కొడుకులు పోయాక ఇక మేం బతికి మాత్రం లాభం ఏముంది... మేమూ చచ్చిపోతాం’’అంటూ పిల్లల తల్లిదండ్రులు ఆస్పత్రివద్ద రోదించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు