పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే అయిదుగురు మృతి..

18 Nov, 2023 10:31 IST|Sakshi

రాయ్‌పూర్‌: చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును డీకొట్టింది. ఈఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గిరిదిహ్‌ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం వెలుగుచూసింది.

బాధితులంతా థోరియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా శుక్రవారం తికోడిహ్‌ ప్రాంతంలో పెళ్లికి హాజరయ్యారు. అక్కడే భోజనం చేసి రాత్రి స్కార్పియో వాహనంలో ఇంటికి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున బాగ్మారా గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది.

గమనించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాద స్థలంలోనే అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన అయిదుగిరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:  తొలిసారి.. ఇక్కడ పోలింగ్‌ భారమంతా మహిళలదే

మరిన్ని వార్తలు