ప్రముఖ సంపాదకుడు రాఘవాచారి కన్నుమూత

29 Oct, 2019 02:13 IST|Sakshi

సాహితీవేత్త, మేధావి, విజ్ఞాన నిఘంటువుగా పేరు ప్రఖ్యాతులు 

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రత్యక్ష విద్యార్థి ఉద్యమంలోకి అడుగు 

1972లో విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు  

మఖ్ధూం భవన్‌లో భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు 

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రముఖ సంపాదకుడు, సాహితీవేత్త, కమ్యూనిస్టు నేత చక్రవర్తుల రాఘవాచారి (80) కన్నుమూశారు. కిడ్నీక్యాన్సర్‌తో ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో నెలక్రితం చికిత్సకోసం చేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. ఉదయం 7గంటల సమయంలో ఆయన భౌతికకాయాన్ని హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూం భవన్‌లో ఉంచారు. అక్కడ ఆత్మీయులు, ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం విజయవాడకు తరలించారు. రాఘవాచారికి భార్య జ్యోత్న్స, కుమార్తె డాక్టర్‌ సి.అనుపమ ఉన్నారు.  

విశాలాంధ్ర సంపాదకునిగా 33 ఏళ్లు 
రాఘవాచారి వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం శాంతాపురానికి చెందిన వరదాచారి, కనకమ్మ దంపతులకు 1939 సెప్టెంబర్‌ 10న జన్మించారు. నిబద్ధత, విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచారు.ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం వరంగల్‌లోనే పూర్తి చేశారు. హైదరాబాద్‌లో లా చదివారు.ఆయనకు విజ్ఞాన నిఘంటువుగాను, మేధావిగాను ఎనలేని గుర్తింపు ఉంది. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్ధి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. 33 ఏళ్ల పాటు విశాలాంధ్ర పత్రిక సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తించిన రాఘవాచారి..సీపీఐ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌గా, జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ సభ్యునిగా వ్యవహరించారు. 1972లో విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఢిల్లీ నుంచి వెలువడే ‘పేట్రియట్‌’దినపత్రిక, లింక్‌ వార పత్రికలకు ఆయన హైదరాబాద్‌ పాత్రికేయునిగా పనిచేశారు. కొద్దికాలం ఢిల్లీలో కూడా పనిచేశారు. పార్టీ కార్యకలాపాల్లో పరిచయమైన విజయవాడకు చెందిన జ్యోత్స్నను ఆయన 1969లో ఆదర్శ వివాహం చేసుకున్నారు.  

రాఘవాచారి భౌతికకాయం వద్ద విషణ్న వదనాలతో కుటుంబ సభ్యులు

ఏడేళ్ల కిందటే కిడ్నీ క్యాన్సర్‌.. 
ఏడేళ్ల క్రితం రాఘవాచారి కిడ్నీ క్యాన్సర్‌తో అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతలో ఉన్నప్పటికీ ఆయన సమకాలీన అంశాలపై పూర్తి అవగాహనతో ఉండేవారు. ఇటీవల కిడ్నీ క్యాన్సర్‌ తిరగబెట్టడంతో తన కుమార్తె అనుపమ వైద్యురాలిగా పనిచేస్తున్న ఆసుపత్రిలోనే చికిత్సకు చేరారు.అక్కడే తుదిశ్వాస విడిచారు.  

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి 
రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయమన్నారు.కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు.అదేవిధంగా సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి,  ప్రముఖ పరిశోధకుడు, కవి జయధీర్‌ తిరుమలరావు రాఘవాచారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. 

రాఘవాచారి సేవలు మరువలేనివి  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం 
విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాఘవాచారి విలువల ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని కొనియాడారు. తెలుగు పాత్రికేయ రంగంలో రాఘవాచారి చేసిన సేవలు మరువలేనివని శ్లాఘించారు. ఆయన రచనలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తాయరు. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రాఘవాచారి భౌతికకాయాన్ని అంబులెన్స్‌లోకి తీసుకువెళ్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులు  


 

మరిన్ని వార్తలు