రైతుకు గిట్టుబాటే లక్ష్యం

21 Nov, 2018 16:02 IST|Sakshi

నాలుగు రిజర్వాయర్లు నిర్మిస్తం 

 ‘పోచారం’ ఆధునికీకరిస్తం 

సాగునీటి కష్టాలు తీరుస్తం 

రవీందర్‌రెడ్డి హోదా కూడా  పెరుగుతది 

 ఎల్లారెడ్డి సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది.  కేసీఆర్‌ మాట్లాడుతూ  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడమే బంగారు తెలంగాణ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు ధర లభిస్తుందన్నారు. 

సాక్షి, కామారెడ్డి/నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి: వ్యవసాయం మీద ఆధారపడ్డ ఎల్లారెడ్డి ప్రజల సాగునీటి కష్టాలు తీరబోతున్నాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ధర్మరావుపేట, మోతె, గుజ్జుల్, కాటేవాడి రిజర్వాయర్లతో పది టీఎంసీల సాగునీరు ఈ భూములకు అందుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. మిషన్‌ కాకతీయ ద్వారా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మరమ్మతులు చేయించారన్నారు.

మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక చెరువులను పునరుద్ధరణ చేయించుకున్న నియోజవర్గం ఎల్లారెడ్డి అన్నారు. తన గజ్వేల్‌ నియోజకవర్గంలోకంటే కూడా ఎల్లారెడ్డిలోనే అత్యధిక చెరువులను పునరుద్ధరించామన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 457 చెరువులను పునరుద్ధరించామన్నారు. మంజీర లిఫ్టు, భీమేశ్వర వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణం, పోచారం ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు జరిగి రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

 అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతుల జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ను అందిస్తున్నామని, పెట్టుబడి సహాయం కూడా అందించి రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడమే బంగారు తెలంగాణ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు ధర లభిస్తుందన్నారు.

వాటి నిర్వహణ మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. రైతులను ధనవంతులను చేయడమే తన లక్ష్యమన్నారు. రైతులు సంతోషంగా ఉంటే తన జీవితానికి అదే తృప్తి అని, అందుకోసమే తాను నిరంతరం శ్రమిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. దేశమంతా మనవైపే చూస్తోందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో గిరిజనులకు సంబంధించి పోడు భూముల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కరెంట్‌ ఆగం కావద్దంటే, పింఛన్లు పెరగాలంటే టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనని పేర్కొన్నారు

 రవీందర్‌రెడ్డిని పెద్దోడిని చేస్తా...  

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తన కుడిభుజంగా ఉన్నారని, ఏనాడూ మడమ తిప్పలేదని, ఉద్యమాన్ని వదలలేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రవీందర్‌రెడ్డి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలువనున్నాడన్నారు. 80 శాతం ఓట్లు రవీందర్‌రెడ్డికి వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. రవీందర్‌రెడ్డికి వచ్చే మెజారిటీని చూసి పక్కనే ఉన్న బాన్సువాడ అభ్యర్థి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈర్ష్య పడవద్దన్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన రవీందర్‌రెడ్డి మామూలు ఎమ్మెల్యేగా ఉండడని, ఆయనకు ఉన్నతి లభిస్తుందని పేర్కొన్నారు. రవీందర్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మీపుత్రుడని కొనియాడిన సీఎం.. ఆయన హయాం లో రైతులకు ఎంతో మేలు జరిగిందని, కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. ఏనుగు మంజులారెడ్డి వందన సమర్పణతో సభ ముగిసింది. సభలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, బీబీపాటిల్, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌రాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్, జిల్లా చైర్మన్‌ సంపత్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, నాయకులు పాల్గొన్నారు.   

మళ్లీ ఆశీర్వదించండి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీందర్‌రెడ్డి 

సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): డిసెంబర్‌ 7న జరుగనున్న ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. డిసెంబర్‌ 7న జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తనను మీ బిడ్డగా, తమ్మునిగా, అన్నగా భావించి తనకు మరోసారి అవకాశమిచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సైడ్‌లైట్స్‌ 

ఎల్లారెడ్డి: 

 • గాంధారి మండలం నుంచి వచ్చిన ఖాయితీ లంబాడా గిరిజన మహిళల నృత్యాలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 • ఎల్లారెడ్డిలో బస్‌డిపోలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో సాయంత్రం 4.38 గంటలకు హెలీక్యాప్టర్‌ దిగింది
 • సీఎం కేసీఆర్‌తో పాటు కేశవరావు, దేశ్‌పతి శ్రీనివాస్‌ హెలీక్యాప్టర్‌ నుంచి దిగారు. మంత్రి పోచారం, ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు సీఎంకు ఘన స్వాగతం పలికారు.
 • సాయంత్రం 4.48 గంటలకు సీఎం సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక మైనారిటీ నాయకులు ఇమామ్‌–ఎ–జమీన్‌ దట్టీ కట్టారు.
 • పోచారం, రవీందర్‌రెడ్డి కొద్దిసేపు మాత్రమే ప్రసంగించారు.
 • 4.55కు ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్‌.. 18 నిమిషాల పాటు కొనసాగించారు. 
 • మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కేసీఆర్‌ మరోమారు లక్ష్మీపుత్రుడిగా అభివర్ణించారు.
 • ఎల్లారెడ్డిలో రవీందర్‌రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
 • సభాస్థలిలో వెనక కూర్చున్న వాళ్లను ముందుకు వదలండని కెసిఆర్‌ చెప్పడంతో బ్యారికేడ్లు తెరవగా ఒక్కసారిగా జనాలు ప్రెస్‌ గ్యాలరీలోకి దూసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌ గ్యాలరీలో ఉన్న వాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. 
 • నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించనున్నామన్న కేసీఆర్‌ హామీకి యువత నుంచి మంచి స్పందన లభించింది. 
 • ప్రజలు ద్విచక్ర వాహనాలపైనే ఎక్కువగా సభకు తరలి వచ్చారు. దాదాపు 5 వేల ద్విచక్ర వాహనాలు వచ్చినట్లు అంచనా.   
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు