మనవాళ్లే మోసం చేస్తున్నరు..

1 Jul, 2019 10:35 IST|Sakshi
ఇంటికి చేరిన గల్ఫ్‌ బాధితుడు నరేష్‌

శ్రమదోపిడీకి గురిచేస్తున్న కాంట్రాక్టర్లు 

ఐసీడీఎఫ్‌ చొరవతో కొందరు స్వదేశానికి..

తాజాగా నలుగురు యువకుల రాక..

సాక్షి, సిరిసిల్ల: ఉపాధి కోసం నిరీక్షిస్తున్న యువకులకు నకిలీ గల్ఫ్‌ ఏజెంట్లు గాలం వేస్తున్నారు. నకిలీ వీసాలను అంటగడుతూ నిలువునా మోసం చేస్తున్నారు. లైసెన్స్‌ పొందిన గల్ఫ్‌ ఏజెంట్లు కొద్ది మందే ఉంటే.. లైసెన్స్‌లేని వాళ్లు ఊరుకొక్క రు ఉన్నారు. కొందరు లైసెన్స్‌ ఏజెంట్లు సైతం సబ్‌ ఏజెంట్లను నియమించుకుని అక్కరకు రాని వీసాలు అంటగడుతున్నారు. గల్ఫ్‌ దేశాలకు చెందిన వివిధ కంపెనీలు సైతం సులభతరంగా వీ సాలు ఇస్తూ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది నకిలీ ఏజెంట్లకు కాసులు కురిపిస్తోంది. వేతనం అధికమని, పనితక్కువగానే ఉం టుందని నకిలీ ఏజెంట్లు అబద్ధపు ప్రచారంతో నిరుద్యోగ యువతను రొంపిలోకి దింపుతున్నారు.

ఖతర్‌లో వీసాల మోసాలు..
నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం బోయపల్లికి చెందిన ముత్తన్న కోట ఖతర్‌లో కాంట్రాక్టర్‌. పనులు చేయించుకునే అతడు.. వలస జీవులకు సరిగ్గా వేతనాలు ఇవ్వడనే అపవాదు ఉంది. తాజాగా మూడు నెలలుగా పని చేయించుకుంటూ చిల్లిగవ్వకూడా ఇవ్వడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.  జీతం ఇవ్వకున్నా.. కనీసం బయటపని చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా వేధింపులు తప్ప మరో మార్గం కనిపించడంలేదు. 

ఇళ్లకు చేరిన వలస జీవులు
ఏజెంట్ల మాటలతో మోసపోయిన వేములవాడకు చెందిన గొర్ల మురళి(42), కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లయ్య, కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన మొకెనపల్లి రాజయ్య ఎంబసీ అధికారులు, ఖతర్‌లోని తెలంగాణ ప్రతినిధుల సాయంతో శుక్రవారం స్వగ్రామాలకు చేరారు. అంతకుముందు పది మంది యువకులు సైతం ఇండియా చేరారు. ఇంకాచాలా మంది ఏం చేయాలో తెలియక అక్కడే మగ్గిపోతున్నారు. అప్పటి ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి జిల్లాలో గల్ఫ్‌ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపారు. నకిలీ ఏజెంట్లను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. దీంతో గల్ఫ్‌ ఏజెంట్లు వీసాల దందా మానేసిన నకిలీలు.. ఇతర పనుల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు పోలీసుల నిఘా తగ్గింది. నకిలీ ఏజెంట్లు వీసాల దందా ప్రారంభించారు. అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు.

ఏజెంట్‌కు ఎనభై వేలు ఇచ్చిన 
బావుసాయిపేటకు చెందిన ఏజంట్‌ అంజయ్యకు ఎనభైవేల రూపాయలు ఇచ్చి ఖతర్‌ పోయిన. జూలై 7వ తేదీకి నాలుగు నెలలు. అక్కడికి పోయిన కాడినుంచి పని చేయించుకున్న ఏజెంట్‌ జీతం ఇవ్వలేదు. నాకు భార్య సావిత్రి, ఇద్దరు కొడుకులు ఉన్నరు. అప్పు చేసి ఖతర్‌ పోతే.. జీతం రాక అప్పులో కూరుకపోయిన. రజని మేడమ్, సంతోష్‌ సార్లు సాయం చేసి ఎంబసీ అధికారుల సాయంతో మా ఇంటికి పంపించిండ్రు.
– మొకెనపల్లి రాజయ్య, పల్లిమక్త

జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు
మనవాళ్లను మనవాళ్లే మోసం చేస్తున్నారు. ఖతర్‌ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ మనవాళ్లే పనిచేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఫోరం(ఐసీడీఎఫ్‌)గా ఏర్పడి ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సాయం చేయిస్తుంటాం. ఇప్పటికే చాలామందికి సాయం చేసి ఇండియా పంపించాం. ఎవరూ ఏజెంట్ల మాటలు నమ్మి మోస పోవద్దు. కంపెనీ వీసాలు, లైసెన్స్‌ ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలి.
– రజని, ఐసీడీఎఫ్, ప్రతినిధి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు