ఆపరేషన్ ‘అంగన్‌వాడీ’

15 Dec, 2014 01:56 IST|Sakshi

ఆదిలాబాద్ : కౌమర బాలికలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, 0 నుంచి 6ఏళ్లలోపు పిల్లలకు ప్రీ స్కూ ల్ నిర్వహించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. పై స్థాయి సిబ్బంది నుంచి కింది స్థాయి వరకు అక్రమాల్లో భాగస్వాములు కావడంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు. మాతా,శిశు సంరక్షణ కోసం  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సాకారానికి దూరంగా నిలుస్తున్నాయి. జిల్లాలో
అంగన్‌వాడీ కేంద్రాలు పూర్తిగా గాడితప్పాయి.

నిర్వహణ, పథకాలను పర్యవేక్షించాల్సిన శాఖ అధికారులే అవినీతికి పాల్పడుతుండడంతో అంగన్‌వాడీల ప్రయోజనం లబ్ధిదారులకు చేకూరడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహార సరుకుల పంపిణీ జరగడం లేదని కలెక్టర్ దృష్టికి రావడంతో గత నెల 12న ఆయన సర్వేకు ఆదేశించారు. 13న ఒకే రోజు జిల్లా అంతటా మెయిన్, మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు మండల స్థాయి అధికారులు నేరుగా వెళ్లి సర్వే చేపట్టారు. ఈ సర్వేలో విస్తూపోయే విషయాలు వెల్లడయ్యాయి.

నేరుగా పరిశీలన

గత నెల 13న కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని 3,538 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 588 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మండల అధికారులు తనిఖీ చేశారు. మం డల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో సర్వే సాగిం ది. మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఏవోలు, ఎంఈవోలు, ఈవోఆర్డీలు, ఏఈఈలు, డెప్యూటీ తహశీల్దార్లు, ఎ మ్మార్‌ఐలు, ఎపీఎంలు, డీపీఎంలు తదితరులు యుద్ధప్రాతిపదికన సర్వే చేపట్టారు. సర్వేకు సంబంధించి ఏ అంశాలను పరిశీలించాలనే దా నిపై ముందుగా రూపొందించిన ప్రొఫార్మా ఆ ధారంగా వివరాలు సేకరించారు.

అందులో మూడేళ్లలోపు పిల్లలకు బాలామృతం కింద ఆ హార పంపిణీ, మూడు నుంచి ఆరు ఏళ్లలోపు పి ల్లలకు అందజేసే ఆహారం, గర్భిణులు, బాలిం తలకు ఇందిరమ్మ అమృతహస్తం కింద అందజేసే ఆహారం, సబల కింద 11 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు సప్లమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రాం కింద అందజేసే ఆహారం వివరాలను ప్రొఫార్మాలో అంశాలుగా రూపొందించి సేకరించారు. సర్వే చేపట్టిన అధికారులు బాలికలు, గర్భిణులు, బాలింతలు నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. రిజిష్టర్‌లో స్టాక్ ఎంట్రీ వివరాలను పరిశీలించారు. ఈ వివరాలను మండల అధికారులు ఆర్డీవోకు అందజేయగా, ఆర్డీవో నుంచి డీఆర్వో, అదనపు జేసీలు క్రోడీకరించి వివరాలను కలెక్టర్‌కు అందజేశారు. అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి.

సరుకులు స్వాహా..
బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. వీటిలో అక్రమాలు జరిగాయి. సరుకుల్లో నాణ్య త లోపిస్తోంది. కాంట్రాక్టర్లతో సీడీపీవోలు మి లాఖతై అక్రమాలకు పాల్పడుతున్నారు. సర్వే అధికారులు స్టాక్ రిజిష్టర్ల విషయంలో అంగన్‌వాడీ వర్కర్లను అడిగినప్పుడు పలు అంశాలు దృష్టికి వచ్చాయి. బియ్యం, పప్పు, నూనె, గు డ్లు కోత పెట్టి పై నుంచి పంపిస్తుండడంతో తాము ఏమి చేయలేకపోతున్నామని వర్కర్లు అధికారుల ముందు వాపోయారు. ఇందిరమ్మ అమృతహస్తంకు సంబంధించి నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోవడంతో తాము అంగన్‌వాడీ కేంద్రాలను నడిపించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని, అప్పు తెచ్చి నడుపుతున్నామని వర్కర్లు తమ గోడు వెల్లడించారు.

బాలామృతం కింద 0 నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 1,18,547 మంది ఉండగా, వారికి ప్రతిరోజు 100 గ్రాముల పౌష్టికాహారం, వారానికి రెండు గుడ్లు అందజేయాల్సి ఉండగా, లబ్ధిదారులకు అందడం లేదని తేలింది. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు జిల్లాలో 91,255 మంది ఉండగా, వారికి ప్రతిరోజు పౌష్టికాహారంతోపాటు నెలకు 16 గుడ్లు అందజేయాల్సి ఉండగా, సగం మందికి కూడా ఇది అందడం లేదని సర్వేలో స్పష్టమైంది. 1,26,883 మంది కిశోర బాలికలకు ప్రతి నెల మూడు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, అరకిలో నూనె, 16 గుడ్లు అందజేయాల్సి ఉండగా, ఇటు సరుకుల్లో నాణ్యతలోపం, గుడ్లు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులైన బాలికలకు పౌష్టికాహారం లభించడం లేదు.

అక్రమాలకు పాల్పడితే చర్యలే..
- ఎం.జగన్మోహన్, కలెక్టర్

లబ్ధిదారులకు పౌష్టికాహారం విషయంలో గత నెల సర్వే నిర్వహించాం. అటెండెన్స్ ఎక్కువగా వేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. నాణ్యమైన ఆహారం అందించడం లేదని పరిశీలనలో తేలింది. సర్వే ఆధారంగా వెలుగులోకి వచ్చిన అంశాలపై సీరియస్‌గా తీసుకుంటున్నాం. సీడీపీవోలు, అంగన్‌వాడీలతో రెండు సార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు జారీ చేశాం. ఆర్జేడి ద్వారా అంగన్‌వాడీల ప్రక్షాళనపై చర్యలు చేపడుతున్నాం. ముగ్గురు సీడీపీవోలకు చార్జీ మెమో జారీ చేశాం. ఆసిఫాబాద్‌కు సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టర్‌ను తప్పించాం. అంగన్‌వాడీల్లో లబ్ధిదారులకు పౌష్టికాహారం సరైన విధంగా అందేలా చర్యలు తీసుకుంటాం.
 
విస్తుపోవాల్సిందే..

బోథ్ నియోజకవర్గంలో అదనపు జేసీ ఎస్‌ఎస్ రాజు ఓ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లినప్పుడు సగం మంది పిల్లలు కేంద్రంలో లేరు. ఆయన స్టాక్ రిజిష్టర్‌ను చూసి విస్తుపోయారు. ప్రతిరోజు చిన్నచిన్న పేపర్లపై సరుకుల వినియోగానికి సంబంధించి రాసి కొన్ని నెలల స్లిప్పులను రిజిష్టర్‌కు కుట్టి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మరో సెంటర్లో రిజిష్టర్ నిండా తప్పులు రాయడంతో వైట్‌నర్‌తో సరిచేసి మళ్లీ పై నుంచి రాశారు. రిజిష్టర్ రాయడం రాదని ఆ వర్కర్ పేర్గొనడం గమనార్హం. రెండేళ్ల నుంచి ఒక లబ్ధిదారు కూడా గైర్హాజరు లేకుండా ప్రతి రోజు హాజరైనట్లు అటెండెన్స్ రిజిష్టర్ ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. పిల్లలు సగం మందే ఉన్నారు కాదా అని.. వర్కర్‌ను అడిగితే పండగలు ఉండడంతో తల్లులు వచ్చి పిల్లలను తీసుకెళ్లారని ఆమె నుంచి సమాధానం వచ్చింది.

ఓ సెంటర్లో గుడ్లు ఎన్ని మిగిలాయి.. అని అడిగితే రెండు అని ఆ వర్కర్ చెప్పగా, పరిశీలనలో ఎనిమిది ఉండడం కనిపించింది. ఆదిలాబాద్ మండలంలో ఓ అంగన్‌వాడీ సెంటర్లో లబ్ధిదారులకు నెలకు 16 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా, ఎనిమిది గుడ్లు మాత్రమే ఇస్తుండడం అధికారుల దృష్టికి వచ్చింది. పై నుంచి తమకు కోత పెట్టి ఇస్తున్నారని, దీంతో తాము లబ్ధిదారులకు కోత పెట్టాల్సి వస్తోందని వారు చెప్పడంతో అధికారుల దిమ్మతిరిగినట్లైంది. మరో అంగన్‌వాడీ కేంద్రంలో వర్కర్ స్థానికంగా ఉండకపోవడం, పట్టణ ప్రాంతం నుంచె ఆమె ఆపరేటింగ్ చేస్తుండడం దృష్టికి వచ్చింది. అనేకమంది వర్కర్లు తమకు రిజిష్టర్ రాయడం రాదని, ఇతరులతో రాయించుకుంటామని చెప్పారు. ఇలా అనేక అంశాలు అధికారుల పరిశీలనలో కనిపించాయి.

మరిన్ని వార్తలు