17 ఏళ్లయినా న్యాయం జరగలేదు: గద్దర్

4 Apr, 2014 03:56 IST|Sakshi
17 ఏళ్లయినా న్యాయం జరగలేదు: గద్దర్

నాపై హత్యాయత్నం కేసు ఇప్పటికీ వీడలేదు
సీబీఐకి అప్పగించండి, గవర్నర్‌కు గద్దర్ లేఖ

 
 సాక్షి, హైదరాబాద్: తనపై హత్యాయత్నం జరిగి 17 ఏళ్లయినా ఇంతవరకు ఆ దాడికి పాల్పడ్డ నిందితులను పట్టుకోలేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రజా గాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఫ్యాక్స్ ద్వారా  గవర్నర్ నరసింహన్‌కు లేఖ పంపారు. 1996 ఏప్రిల్ 6న అల్వాల్‌లోని నివాసంలో ఉన్న తనపై గ్రీన్‌టైగర్స్ పేరుతో కొందరు అగంతకులు కాల్పులు జరిపారని, ఇప్పటికీ ఓ బుల్లెట్ తన వెన్నుపూసలోనే ఉందని గద్దర్ పేర్కొన్నారు. అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు, హోంమంత్రిగా మాధవరెడ్డి, డీజీపీగా హెచ్ జే దొర ఉన్నారని వివరించారు.
 
 దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ.. నిందితులు దొరకలేదంటూ కేసును మూసేసిందని, తాను కోర్టును ఆశ్రయించడంతో కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించారని గద్దర్ తన లేఖలో పేర్కొన్నారు. చివరికి ఇన్నేళ్లయినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం, పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా గవర్నర్ జోక్యం చేసుకుని తనపై దాడి కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని, దోషులను పట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు