శంషాబాద్‌ వరకు మెట్రో

3 Feb, 2020 08:06 IST|Sakshi

అంతర్జాతీయ స్థాయిలోఅభివృద్ధి చేస్తాం  

రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌

శంషాబాద్‌: విమానాశ్రయంతో అంతర్జాతీయంగా పేరుగాంచిన శంషాబాద్‌ను అభివృద్ధిలోనూ అదే స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన శంషాబాద్‌ మాజీ సర్పంచ్‌ ఆర్‌.గణేష్‌ గుప్తా తన అనుచరగణంతో పాటు శంషాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని 8 మంది కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మెట్రో రైలును శంషాబాద్‌ వరకు పొడిగిస్తామన్నారు. శంషాబాద్‌ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు  ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వారి తీరు మారడం లేదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంపై నమ్మకంతోనే తెలంగాణ అభివృద్ధి కోసం గణేష్‌గుప్తా లాంటి నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి బాటలు పడ్డాయని టీఆర్‌ఎస్‌లో చేరిన గణేష్‌గుప్తా అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి ఎదురులేదన్నారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు జహంగీర్‌ఖాన్, అజయ్, కుమార్, భద్రు, రేఖ, విజయలక్ష్మి, నజియా, సునీత, వ్యాపారవేత్త వేణుమాధవ్‌రెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు