పన్నుల శాఖలో ఎన్నికల లొల్లి

9 May, 2019 02:52 IST|Sakshi

రెండు వర్గాలుగా విడిపోయిన గెజిటెడ్‌ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్ర పన్నుల శాఖలో కూడా ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్ర పన్నుల శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం సారథ్యం కోసం జరగనున్న ఈ ఎన్నికలు ఆ శాఖలో అసలైన ఎన్నికల సెగ పుట్టిస్తున్నాయి. సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే ఆనవాయితీ ఉన్నా ఈ దఫా గెజిటెడ్‌ అధికారులు రెండుగా చీలిపోవడంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. తూకుంట్ల వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, సమస్యల పరిష్కారంలో తాత్సారం వహిస్తోందని ఆరోపిస్తూ కొందరు ప్రస్తుత కార్యవర్గాన్ని వ్యతిరేకించి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు. దీంతో కేవలం 350 ఓట్లే ఉన్నా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీసీటీజీవోఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే, ప్రస్తుత కార్యవర్గం తమ పనితీరును సమర్థించుకుంటోంది. అటు ప్రభుత్వంతో, ఇటు ఉన్నతాధికారులతో సానుకూల దృక్పథంతో వెళ్తూనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామని, కొన్నింటిని పూర్తిస్థాయిలో పరిష్కరించే దశకు చేరుకున్నామని సంఘం నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలు పన్నుల శాఖలో వేడి పుట్టిస్తున్నాయి.  

బదిలీలు, పదోన్నతులే ఎజెండా..
ముఖ్యంగా ఈసారి ఎన్నికలు జరిగేందుకు శాఖ పరిధిలోని ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరించలేదని, బదిలీలు సక్రమంగా జరగకపోవడంతో పదోన్నతులు కూడా నిలిచిపోయాయనే చర్చ శాఖలో జరుగుతోంది. అయితే టీసీటీజీవోఏ కార్యవర్గం మాత్రం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో చేయాల్సిందంతా చేశామని చెబుతోంది. డిపార్ట్‌మెంట్‌ చరిత్రలో ఎన్నడూ ఇవ్వనన్ని పదోన్నతులు సాధించామని, రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని కేటగిరీల్లో 75 శాతం మంది ఉద్యోగులు కనీసం ఒక్క పదోన్నతి అయినా తీసుకున్నారని, గతం కంటే పారదర్శకంగా వ్యవహరించడం ద్వారానే ఇది సాధ్యమైందని అంటోంది. అసోసియేషన్‌ ఎన్నికలకు ఇప్పటికే 2 ప్యానెళ్లు నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ల ఉపసంహరణకు నేడు తుది గడువు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ జరగకపోతే ఈ నెల 13న ఎన్నికలు అనివార్యం కానున్నాయి.

పద్ధతిలో తేడా తప్ప పోరాటం ఆగదు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010లో మా అసోసియేషన్‌ ఏర్పడింది. రాష్ట్ర అస్తిత్వం, మనుగడ, పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించాం. అధిక పనిభారం, ఒత్తిడితోపాటు శాఖాపరంగా ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు. కొత్త రాష్ట్రంపై తీవ్ర పోరాటాలు చేయలేం. శాంతియుత, ప్రజాస్వామిక, సమన్వయ పద్ధతుల్లోనే ఇది సాధ్యమవుతుంది. పోరాట పద్ధతుల్లో తేడా ఉంటుంది తప్ప పోరాటం ఆగదు.            
    – తూకుంట్ల వెంకటేశ్వర్లు,టీసీటీజీవోఏ అధ్యక్షుడు

>
మరిన్ని వార్తలు