కాంగ్రెస్‌ను తరిమికొట్టండి

7 Apr, 2017 01:26 IST|Sakshi
కాంగ్రెస్‌ను తరిమికొట్టండి

ఆర్మూర్‌ జనహిత ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌
- దేశంలో దరిద్రానికి ఆ పార్టీయే కారణం
- దొంగ కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు
- ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు
- ఏపీలో చెప్పిన మాటలకు తలూపే టీడీపీ డూడూ బసవన్నలను పట్టించుకోవద్దు
- టీఆర్‌ఎస్‌ది నిరుపేదల ప్రభుత్వమని వెల్లడి
- అన్న కేటీఆర్‌ను ఆశీర్వదించండి: ఎంపీ కవిత  


సాక్షి, నిజామాబాద్‌: దేశంలోని దరిద్రానికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించాలని ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌) పిలుపునిచ్చారు. ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ దేశానికి చేసిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతిలో ఉండేవారు చెప్పిన మాటలకు.. ఇక్కడ (తెలంగాణలో) తలూపే డూడూ బసవన్నలను పట్టించుకోవద్దని టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్‌ జనహిత ప్రగతి సభ నిర్వహించింది. అందులో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోదావరి నీళ్లను బీడు భూములకు తరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే కాంగ్రెస్‌ నేతలు దొంగ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లతో కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే అంగీకరించారని పేర్కొన్నారు.


ఇన్నాళ్లూ ఏం చేశారు?
సుమారు ఐదు దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని ఉద్ధరించి ఉంటే ప్రజలు వేరే వారికి అవకాశమిచ్చేవారు కాదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘మూడేళ్ల పసిగుడ్డులాంటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు.. అధికారంలో ఉన్న 50 ఏళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా? తెలంగాణ ఏర్పడితే విద్యుత్‌ సమస్య తలెత్తుందని, రైతుల పరిస్థితి దీనమవుతుందని, మావోయిస్టులు పెరుగుతారని, భూస్వాములు రాజ్యమేలుతారని.. ఇలా ఎన్నో భయాందోళనలను అప్పటి సీఎం కిరణ్‌ సృష్టించారు. కానీ మా ప్రభుత్వ పనితీరు వాటన్నింటినీ పటాపంచలు చేసింది..’’అని పేర్కొన్నారు.

సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించాం
తమది నిరుపేదల ప్రభుత్వమని.. సంక్షేమ పథకాల కోసం బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. గతంలో లబ్ధిదారులెవరైనా చనిపోతేనే వారి స్థానంలోనే కొత్తవారికి పింఛన్లు ఇచ్చేవారని, కానీ తమ ప్రభుత్వం అర్హులైన అందరికీ పింఛన్లు ఇస్తోందన్నారు. నిరుపేదలకిచ్చే బియ్యంలో రాజీ పడకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు హాస్టళ్లలో సన్నబియ్యం భోజనం వడ్డిస్తున్నామన్నారు.

సీఎం కేసీఆర్‌ నూతనంగా ప్రకటించిన ‘అమ్మఒడి’పథకం కింద బాలింతలకు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు అందజేస్తున్నామని.. 13 వస్తువులతో కూడిన కేసీఆర్‌ కిట్‌లనూ ఇస్తున్నామని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా చిన్న నీటి వనరుల అభివృద్ధి, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సభలో ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, షకీల్‌ అహ్మద్, హన్మంత్‌షిండే తదితరులు పాల్గొన్నారు.

అన్న కేటీఆర్‌ను ఆశీర్వదించండి: కవిత
వరుస ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు చుక్కలు చూపించామని... నిరుపేదల సంక్షేమం కోసం పనిచేసే కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ఒక్కటే బలంగా ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకూ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. గతేడాది 51 లక్షల టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వాలు నమోదైతే.. ఈసారి ఇప్పటికే 75 లక్షలకు మించిందని, అన్ని వర్గాల వారూ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. కేటీఆర్‌ వంటి అన్న ఉన్నందుకు తనకు గర్వంగా ఉందని, తన సోదరుడిని ఆశీర్వదించాలని కోరారు.

కేబినెట్‌లో ఆణిముత్యం కేటీఆర్‌..
రాష్ట్ర మంత్రివర్గంలో కేటీఆర్‌ ఒక ఆణిముత్యమని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కితాబిచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేని విధంగా కేసీఆర్‌ 34 నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తన పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దారని ఎంపీ డి.శ్రీనివాస్‌ కొనియాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఎంపీ కవిత.. రాష్ట్రానికి వన్నె తెచ్చేవిధంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్‌ ఫాదర్‌ ఆఫ్‌ తెలంగాణ అయితే కేటీఆర్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ’అని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు