రైతుకు చేయూతనిద్దాం

29 Dec, 2014 23:21 IST|Sakshi
రైతుకు చేయూతనిద్దాం

సిద్దిపేట జోన్:  రైతు సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ ముందుకు సాగుతోందని, అధికార యంత్రాంగం కూడా ఆ మేరకు కృషి చేసి రైతుకు చేయూతనివ్వాలని మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం ఆమె సిద్దిపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు, పత్తి మార్కెట్, రైతు బజార్‌లను సందర్శించారు.

ఈ సందర్భంగా మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకుముందు పలు శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు చేయూతనిచ్చే విధంగా అధికార యంత్రాంగం పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో వినూత్నంగా అంగన్‌వాడీల ద్వారా మహిళలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కొత్త పథకాన్ని రూపకల్పన చేసిందన్నారు.

విజయ డెయిరీని పౌల్ట్రీ పరిశ్రమతో సమన్వయ పరుస్తూ ప్రతి రోజు ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, ఆరు సంవత్సరాలలోపు చిన్నారులకు కోడిగుడ్డు, పాలు, నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ తన సర్వేలో 65 శాతం మహిళలకు రక్త హీనత ఉందని తేల్చిందన్నారు. అందువల్ల మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల్లో మదర్స్ కమిటీని ఏర్పాటు చేసి అంగన్‌వాడీల పనితీరును మెరుగుపరుస్తామన్నారు.  

సిద్దిపేటలో అత్యాధునిక రైతు బజార్
రాష్ట్రంలోనే అత్యాధునికమైన రైతు బజార్‌ను సిద్దిపేటలో నిర్మించాలని సర్కార్ భావిస్తోందని  పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఏఎంసీ మార్కెట్ యార్డును త్వరలోనే పత్తి మార్కెట్‌యార్డులోకి మార్చనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు సిద్దిపేట మార్కెట్ యార్డుకు వస్తున్న ధాన్యం కొనుగోళ్ల వివరాలు, సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా ప్రస్తుత యార్డులోనే పండ్లు, కూరగాయలు , చేపలు, మాంస విక్రయించేలా వసతులు కల్పిస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు రూపొందించిన ప్రణాళికను ఆమె పరిశీలించారు. యార్డులో రైతులు పండించిన కూరగాయలు పరిస్థితులకు అనుగుణంగా విక్రయాలకు వస్తాయని, ఆ దిశగా బహుళ ప్రయోజనాలతో కూడిన వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా చేపల మార్కెట్‌కు అనుగుణంగా యార్డులో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని,  కోల్డ్ స్టోరేజ్ వసతి, హోల్‌సేల్ విక్రయాలకు అనుగుణంగా ప్రణాళికను   రూపొందించాలని ఆమె ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఉద్యానశాఖ అధికారులతో సమీక్షిస్తూ రైతుల డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. ‘మన ఊరు, మన కూరగాయలు’ తరహాలోనే విస్త్రత ప్రచారం చేపట్టాలన్నారు.

వచ్చే సీజన్ నాటికి సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పెద్ద రైతు బజార్‌ను నిర్మించేలా సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డెరైక్టర్ లక్ష్మిబాయి, డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్, పశు సంవర్దక శాఖ జేడీ లకా్ష్మరెడ్డి, ఉద్యాన శాఖ ఏడీ రామలక్ష్మి, ఆర్డీఓ ముత్యంరెడ్డి,  ఏడీఏలు వెంకటేశ్వర్లు, ఏఎంసీ కార్యదర్శి సంగయ్య, తహశీల్దార్ ఎన్‌వై గిరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు