తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు

19 Jun, 2015 04:10 IST|Sakshi
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి జరుగుతున్న గోదావరి పుష్కరాలలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పుష్కరాల్లో నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలపై గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, భద్రాచలం, కందకుర్తి తదితర కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో పుష్కరోత్సవాన్ని పూర్తిగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించడానికి సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రచారానికి సంబంధించి సీడీల తయారీ, మీడియాలో ప్రచారాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు సుభాష్, దూరదర్శన్, ఆకాశవాణి ప్రతినిధులు, భద్రాచలం, ధర్మపురి ఈవోలు, సాంస్కృతిక సారథి ప్రతినిధులు, జిల్లాల డీపీఆర్‌వోలు, ఆలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు