మీ దీవెనలే.. గెలిపిస్తున్నాయి

12 Nov, 2018 19:17 IST|Sakshi
తాండూరు పట్టణంలో గౌడ కులస్తుల ర్యాలీ   

అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ధ్యేయం 

గౌడ కులస్తులకు అన్ని విధాలా సహకరిస్తాం  

కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి చేయూతనిస్తాం

మంత్రి మహేందర్‌రెడ్డి 

సాక్షి, తాండూరు టౌన్‌: అన్నివర్గాల ప్రజల నుంచి అందుతున్న దీవెనలే ఇన్నేళ్లుగా తనను విజయ తీరాలకు చేరుస్తున్నాయని, తాండూరు ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ఆశయమని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక భవానీ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం గౌడ, ఈడిగ, గీత కార్మికుల ఆధ్వర్యంలో మంత్రికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, గౌడ కులానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని తెలిపారు. నాలుగేళ్ల తమ పాలనలో అన్ని మతాలు, కులాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. గీత కార్మికులకు పింఛన్ల మంజూరు, కల్లు దుకాణాల లైసెన్స్‌ల జారీ, సొసైటీ ఏర్పాటులో అండగా నిలిచిందని చెప్పారు.

గౌడ కులస్తులను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తాండూరులో గౌడ్‌ల కోసం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి గాను గతంలోనే 2 ఎకరాల భూమి ఇచ్చామన్నారు. భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశామని స్పష్టంచేశారు. ఈ నిధులు సరిపోకపోతే జెడ్పీ, ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులకు పింఛను, చెట్టు పన్ను మాఫీ తదితర సహకారాలు అందించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు.

ప్రజల దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో గౌడ కులస్తులకు ఏనాడూ కాంగ్రెస్‌ పార్టీ గజం స్థలం ఇవ్వలేదని, ఆర్థికంగా ఆదుకున్న దాఖలాలు కూడా లేవని విమర్శించారు. అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్‌ మాట్లాడుతూ.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే గౌడ్‌లకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి చేయూతనివ్వాలని కోరారు. అలాగే ఎక్సైజ్‌ దాడులను, బెల్టు షాపులను అరికట్టాలన్నారు. అంతకు ముందు   పట్టణంలో గౌడ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యాద కృష్ణమూర్తి, కరణం పురుషోత్తంరావు, నారాయణరెడ్డి, రాందాసు, రవిగౌడ్, సాయిలుగౌడ్, హరిగౌడ్, నారాయణగౌడ్, సంతోష్‌గౌడ్, వరప్రసాద్‌గౌడ్, రాకేష్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు