ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఓటేయాలి

26 Jan, 2019 03:35 IST|Sakshi

జాతీయ ఓటర్ల దినోత్సవంలో గవర్నర్‌ నరసింహన్‌

లోక్‌సభ ఎన్నికల్లో 90 శాతానికి ఓటింగ్‌ పెరగాలి

ఫిబ్రవరి 4 వరకు ఓటును నమోదు చేసుకోవాలి: సీఈఓ

సాక్షి, హైదరాబాద్‌: ఓటు భవిష్యత్తును నిర్ణయించే ఆయుధమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ఆయనతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్, ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 90 శాతానికి ఓటింగ్‌ పెరగాలని ఆకాం క్షించారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనాలి.

సెలవున్నా పోలింగ్‌లో పాల్గొనకపోవడం ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటింది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. యువత తప్పక ఓటింగ్‌లో పాల్గొనాలి..’అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారని రజత్‌కుమార్‌ను గవర్నర్‌ ప్రశంసించారు. దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అభినందించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటింగ్‌ పెరిగేలా ప్రయత్నించాలని ఆయన సూచించారు. 

ఓటును నమోదు చేసుకోవాలి: సీఈఓ
అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించామని.. పోలింగ్‌ శాతం పెంచామని సీఈఓ రజత్‌కుమార్‌ చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని.. రిపోలింగ్‌ జరపాల్సిన పరిస్థితి రాలేదని తెలిపారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 4 వరకు ఓటును నమోదు చేసుకోవాలన్నారు.

గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోలవుతుంటే.. జీహెచ్‌ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోలవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలున్నప్పటికీ జనాలు ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌.. అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆబ్కారీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్, అదనపు సీఈఓ బుద్ధ ప్రకాశ్, జాయింట్‌ సీఈఓ అమ్రపాలికి అవార్డులను ప్రదానం చేశారు. 

మరిన్ని వార్తలు