రోగుల పట్ల శ్రద్ధతో మెలగండి: గవర్నర్‌

12 Oct, 2019 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోగులపట్ల శ్రద్ధతో మెలగాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ, విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆమె ఒకింత హెచ్చరిస్తూ వైద్యులు జాగ్రత్తగా మెలగాలని సూచించారు. ఈఎస్‌ఐసీ వైద్యకళాశాలలో శుక్రవారం జరిగిన హిప్పోక్రటిక్‌ ప్రమాణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఈఎస్‌ఐసీ 2019–20 బ్యాచ్‌ వైద్య విద్యార్థులతో హిప్పోక్రటిక్‌ ప్రమాణం చేయించారు. 2019–20 విద్యా ఏడాదిలో ప్రతిభ కనబర్చిన 19 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీని దేశంలో ప్రముఖ కళాశాలగా తీర్చిదిద్దినందుకు కళాశాల యాజమాన్యాన్ని తమిళిసై అభినందించారు. 2016 నుంచి ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ ప్రాంగణం ప్లాస్టిక్‌ రహితంగా ఉండటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఈఎస్‌ఐసీ ఫైనాన్స్‌ కమిషనర్‌ శుక్లా తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు