మద్దిలేటి కేసు సిట్‌కు బదిలీ

12 Oct, 2019 02:42 IST|Sakshi

ఏసీపీ నేతృత్వంలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు

మావోయిస్టు అనుబంధ సంస్థల కార్యకలాపాలపై కన్ను

వెల్లడించిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటిపై తూర్పు మండలంలోని నల్లకుంట పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు బాధ్యతల్ని నగర నేర పరిశోధన విభాగం ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అప్పగిస్తూ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ విభాగం ఏసీపీ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు సాగుతుందని స్పష్టం చేశారు. గద్వాల్‌ పోలీసుల సమాచారంతో అడిక్‌మెట్‌లోని మద్దిలేటి ఇంట్లో మంగళవారం సోదాలు చేసిన పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీని దర్యాప్తు పరిధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మద్దిలేటి ఇంట్లో చేసిన సోదాల్లో నిషేధిత సాహిత్యంతో పాటు బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ రాసిన లేఖ సైతం పోలీసులకు దొరికింది. ఇందులో ప్రముఖ విద్యా సంస్థల్ని బెదిరించి డబ్బు వసూలు చేయాలనే ఆదేశాలు ఉన్నట్లు కమిషనర్‌ తెలిపారు. దీంతో పాటు ‘సందేశం’పేరుతో కరపత్రాలు లభించాయని, వీటిలో హింసను ప్రేరేపించే విషయాలు, చైనీయుల కమ్యూనిస్టు విప్లవం తదితరాలు ఉన్నాయన్నారు. నిషేధిత మావోయిస్టు అనుబంధ సంస్థలు అనేకం ఉన్నాయని వీటి కార్యకలాపాలపై డేగకన్ను వేశామని తెలిపారు. టీవీవీకి చెందిన అనేక మందిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నాయని తెలిపారు. ఎల్‌ఎల్‌బీ మధ్యలోనే మానేసిన మద్దిలేటి టీవీవీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అతనిపై వరంగల్‌లోని సుబేదారీ, కొత్తగూడెం జిల్లా, గద్వాల్‌ టౌన్, కాజీపేటల్లోనూ తీవ్రమైన కేసులు నమోదై ఉన్నట్లు వివరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా