రైతన్నదే ముఖ్య భూమిక

14 Feb, 2020 02:33 IST|Sakshi
గురువారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో వరినారును పరిశీలిస్తున్న గవర్నర్‌ తమిళిసై

వ్యవసాయ వర్సిటీలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

రాజేంద్రనగర్‌: ప్రపంచంలో వ్యవసాయరంగంతోపాటు అన్నదాతది ప్రథమ స్థానమని గవర్నర్, వ్యవసాయ వర్సిటీ చాన్స్‌లర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో ఆమె పర్యటించారు. తొలుత ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యంత్రాల ద్వారా వరినాట్ల విధానాన్ని, పాలీహౌస్‌ను, వర్సిటీ నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ను పరిశీలించారు. చిరుధాన్యాల ఉత్పత్తుల కేంద్రాన్ని, పర్యావరణహిత గణేశ్‌ విగ్రహాలు, హోలీరంగుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏజీ బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థులు ప్రయోగాత్మకంగా చేస్తున్న సాగుపై గవర్నర్‌ వివరాలడిగారు. ఎలక్ట్రానిక్‌ విధానం ద్వారా పుస్తకాలు ఇచ్చే, తీసుకునే వి«ధానాన్ని ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. రైతుబిడ్డలుగా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు రైతుబిడ్డలకీ తల్లిదండ్రులుగా మారాలన్నారు. విద్యార్థులు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. ఐదేళ్లలో అనేక జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలు, సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, వివిధ విత్తనాల రూపకల్పన గురించి వర్సి టీ ఉపకులపతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు, ఇతర శాస్త్రవేత్తలు ఆమెకు వివరించారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్, పాలకమండలి సభ్యులు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రకృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి 
ప్రకృతిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణలో హరితహారం కొనసాగుతుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్‌ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1938లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌లు గొప్ప ఆలోచనతో నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో 100 స్టాళ్లతో నుమాయి ష్‌ను ప్రారంభించగా ఎంతో ప్రఖ్యాతి పొందిందని తెలిపారు. సొసైటీ ప్రతినిధులు ఎంతో కష్టపడి పకడ్బందీగా భద్రతా చర్యలతో నుమాయిష్‌ను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.

సరోజిని నాయుడు జన్మదినం రోజున ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్, జాయింట్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్, ఆర్‌డీఓ శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ వినయ్‌కపూర్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను, సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎన్‌.సురేందర్, కార్యదర్శి డాక్టర్‌ ప్రభాశంకర్, సంయుక్త కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు