దిద్దుబాటు

16 Dec, 2015 00:47 IST|Sakshi
దిద్దుబాటు

   ప్రగతి దిశగా సర్కార్ బడులు!
     కార్పొరేట్‌కు దీటుగా.. చర్యలు
   సీబీఎస్‌ఈ తరహా విధానం అమలు
   ఒంటిపూట సెలవులు రద్దు
   మార్చి 21 నుంచి పై తరగతుల బోధన
   సమస్యలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: 1800 425 7462
   విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక
 
 పాపన్నపేట:
ప్రభుత్వ పాఠశాలలను ప్రగతి దిశగా పరుగులు తీయించేందుకు రాష్ట్ర సర్కార్ సమాయత్తమవుతోంది. కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. రోజు రోజుకు సర్కార్ బడుల్లో దిగజారుతున్న విద్యాప్రమాణాలను మెరుగు పర్చి సత్తా చాటేందుకు విద్యాశాఖ డెరైక్టరేట్ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. మార్చి నెలలో నిర్వహించే ఒంటి పూట బడులను రద్దు చేసింది. మార్చి 14 లోగా పరీక్షలు పూర్తి చేసి 21 నుంచి పైతరగతుల బోధన చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక సీబీఎస్‌ఈ తరహా విధానం అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ డీఈఓలను ఆదేశించారు. ఈ మేరకు మెదక్ డీఈఓ నజీమొద్దిన్ ఇటీవల సంగారెడ్డిలో జరిగిన ఎంఈఓల సమావేశంలో కొత్త ప్రణాళికను ప్రకటించారు.

 జిల్లాలో సుమారు 2,899 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇటీవల రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ టీంలు నిర్వహించిన పరిశీలనలో సర్కార్ బడుల్లోని డొల్లతనం బయట పడింది. దీంతో ఉనికిని కాపాడుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సీబీఎస్‌ఈ తరహా విధానం అమలు పర్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఈ మేరకు మార్చి నెలలో ఇచ్చే ఒంటి పూట సెలవులను రద్దు చేసింది. మార్చి 21 నుంచి ఎప్రిల్ 23 వరకు పైతరగతుల బోధన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం 1 నుంచి 9 తరగతుల వరకు మార్చి 7 నుంచి 14వ తేదీలోగా వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.

 ఫార్మెటివ్ 4 పరీక్షలను ఫిబ్రవరి 28న నిర్వహించాల్సి ఉంటుంది. పదోతరగతికి జనవరి 31న నిర్వహించాలి. మార్చి 21 లోగా 9 వతరగతి వరకు ప్రొగ్రెస్ కార్డులు ఇవ్వాలి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు పదో తరగతి పరీక్షలుంటాయి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు. జూన్ 13న పాఠశాలలను పునఃప్రారంభిస్తారు.మైనారిటీ స్కూళ్లకు డిసెంబర్ 24 నుంచి 30 వరకు క్రిస్మస్ సెలవులు, ఇతర స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తారు.  

 ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్
 పాఠశాలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 7462ను పాఠశాల విద్యాడెరెక్టైరేట్ అందుబాటులోకి తెచ్చింది. ప్రతి పాఠశాలలో విధిగా ఈ నంబర్ బహిరంగంగా రాసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
 

>
మరిన్ని వార్తలు