అ'దృశ్యం' కాదిక

14 Nov, 2018 09:19 IST|Sakshi

ఎన్నికల’ కార్యకలాపాలపై పోలీసుల డేగకన్ను

కీలక ఘట్టాలన్నీ ఎక్కడిక్కడ వీడియో రికార్డింగ్‌

నిబంధనల ఉల్లంఘనపై పక్కా ఆధారాలు

ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులకూ మార్గదర్శకాలు

సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడంపై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూసేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు రాజకీయ పార్టీలు, నేతలపై డేగకన్ను వేస్తున్నారు. నోటిఫికేషన్‌ సైతం విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో ఎలాంటి ఏమరుపాటుకు తావులేకుండా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. పాతబస్తీతో పాటు కొన్ని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై నగర పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తూ పలు ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క స్పెషల్‌ బ్రాంచ్‌లకు చెందిన సిబ్బంది సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి, నివేదికలు తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసిన యంత్రాంగం పక్కా రక్షణ చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. వీటిలో భాగంగా అత్యంత సున్నిత, సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వీటిలో పోలింగ్‌ పూర్తయ్యే వరకు అదనపు బలగాలను మోహరిస్తున్నారు.  

ప్రతి ఘట్టమూ ‘రికార్డు’..
సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుకు జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం) పరిజ్ఞానం కలిగిన వాహనాలను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించారు. మరోపక్క ప్రస్తుతం పోలీసు, కమ్యూనిటీల అధీనంలో ఉన్న సీసీ కెమెరాలను ఎన్నికల నిఘా కోసమూ వాడాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కెమెరాలను వినియోగించి కార్యకర్తలు, అభ్యర్థుల కదలికలను గమనించడానికి సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ఈ తతంగాలను ప్రధాన కమిషరేట్లలో ఉన్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లలో రికార్డు చేస్తున్నారు. ప్రచార సరళి ప్రభావంతో ట్రాఫిక్‌ జామ్‌లకు తావులేకుండా తీసుకోవాల్సిన చర్యలనూ నిర్ణయించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న శాంతి భద్రతల, ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లలో డిజిటల్, వీడియో కెమెరాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల నేపథ్యంలో మరికొన్ని ప్రైవేటు కెమెరాలను అద్దెకు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. వీటిని వినియోగించి ఎన్నికల్లోని ప్రతి ఘట్టాన్నీ రికార్డు చేయాలని నిర్ణయించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారం మెుదలుకొని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ దశలోనూ ఉల్లంఘనలకు తావు లేకుండా, అలాంటి వాటిని పాల్పడిన వారిని గుర్తించడం, చర్యలు తీసుకోవడానికి ఆధారాలుగా వినియోగించడానికి ఈ ఫీడ్‌ను వాడనున్నారు.  

బూత్‌ల ‘హద్దులు’ తేలుస్తున్న ఎలక్షన్‌ సెల్స్‌..
మూడు కమిషరేట్లలో పని చేస్తున్న ప్రత్యేక ఎలక్షన్‌ సెల్స్‌కు ఇప్పుడు ఓ చిక్కు వచ్చిపడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో బందోబస్తు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ఎలక్షన్‌ సెల్‌ కసరత్తు చేస్తోంది. వివిధ పోలీసుస్టేషన్ల పరిధుల సరిహద్దుల్లోని పోలింగ్‌ బూత్‌లతోనే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. ఇవి ఎవరి పరిధిలోని వస్తాయనేది తేల్చనున్నారు. సమస్యాత్మక బూత్‌లు ఉన్న చోట్ల మరింత పక్కాగా వ్యవహరించనున్నారు. ఆయా ఎలక్షన్‌ సెల్స్‌ జోన్ల వారీగా పోలీసుస్టేషన్ల పరిధులు, వాటిలోని పోలింగ్‌ బూత్‌లను గుర్తించే పనిలో పడ్డాయి. దీనికోసం పోలీసు అధికారులను పోలీసుస్టేషన్ల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్‌ బూత్‌లకు పంపిస్తూ అవి ఏ స్టేషన్‌ కిందికి వస్తాయో తేలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాతే పూర్తిస్థాయి బందోబస్తు స్కీమ్‌లు రూపొందించనున్నారు.

ప్రింటింగ్‌పై ‘ముద్ర’లుండాల్సిందే..
ఈసీ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రింటింగ్‌ ప్రెస్‌లపైనా దృష్టి పెట్టనున్నారు. జోన్లు, డివిజన్ల వారీగా ఆయా ప్రెస్‌ల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల ముద్రణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దృష్టి పెట్టాల్సిన అంశాలను వారికి వివరించనున్నారు. ముద్రించే ప్రతిదానిపైనా ప్రింటర్స్‌ అండ్‌ పబ్లిషర్స్‌ పేరు, ఏ పార్టీ/అభ్యర్థి కోసం ముద్రిస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పక ముద్రించాలని స్పష్టం చేయనున్నారు. ప్రతి ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని ఓ రికార్డు ఏర్పాటు చేసి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలని, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని స్పష్టం చేయనున్నారు. వీటిని ఉల్లంఘించే ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు