ఘనంగా జిల్లాల సంబురాలు

8 Oct, 2016 04:31 IST|Sakshi
శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్కు కొత్తజిల్లాలపై నివేదిక సమర్పిస్తున్న హైపవర్ కమిటీ సభ్యులు

రాష్ట్రావతరణ తరహాలో జరపాలి.. కేబినెట్ భేటీలో నిర్ణయం
అన్ని జిల్లాలు ఒకే సమయంలో ప్రారంభించాలి
ఒకట్రెండు రోజుల్లో ముహూర్తం ఖరారు
మొదట పోలీస్ పరేడ్, తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ
ఆ వెంటనే కలెక్టర్ కార్యాలయాల ప్రారంభం.. మంత్రులతో బహిరంగ సభలు
31 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదం
కొత్త జిల్లాలకు తెలంగాణ ప్రముఖుల పేర్లపై చర్చ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ వేడుకల తరహాలో జిల్లాల ఆవిర్భావ సంబురాలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో పాత జిల్లాలు సహా మొత్తం 31 జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. కొత్త జిల్లాల ప్రారంభం, జిల్లాల పేర్లు, కేకే నేతృత్వంలోని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికపైనే భేటీలో ప్రధాన చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల సరిహద్దుల విషయంలో ఆయా జిల్లాల స్థానిక మంత్రులు ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు.
 
ఒకే ముహూర్తానికి ప్రారంభం
కొత్తగా ఏర్పడబోయే జిల్లాలన్నింటినీ ఒకే సమయంలో ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఒకట్రెండు రోజుల్లో ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. కొత్త జిల్లాల్లో మొదట పోలీసు బలగాల పరేడ్, తర్వాత జాతీయ పతాకావిష్కరణ, ఆ వెంటనే కలెక్టర్ కార్యాలయ ప్రారం భం ఉంటుంది. కలెక్టర్లు బాధ్యతలు తీసుకున్న అనంతరం బహిరంగ సభల్లో మంత్రులు పాల్గొననున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేసుకోవాలని సీఎం సూచించారు.

జిల్లాల పరిధిలోని కొత్త రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాలు, కొత్త పోలీసు స్టేషన్లను ఎమ్మెల్యేలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు పాల్గొనాలని, ఈ అంశంపై మంత్రులు తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లడానికి కొన్ని మండలాలు, గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారన్న అంశంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఆయా జిల్లాల మంత్రులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

మొత్తంగా 31 జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినా తుది నోటిఫికేషన్‌లో వెల్లడిస్తామని మంత్రులతో సీఎం అన్నారు. మరోవైపు అలంపూర్ నియోజకవర్గాన్ని గద్వాల నియోజకవర్గంలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్, రాజోలి మండలాలను ప్రతిపాదిత వనపర్తి జిల్లాలో ఉంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచాలని నిర్ణయించారు.
 
కొత్త జిల్లాల పేర్లపై చర్చ
కొత్త జిల్లాల పేర్లపైనా కేబినెట్‌లో చర్చించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, సురవరం ప్రతాప్‌రెడ్డి, రాజు బహదూర్ వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామి, మహేంద్రనాథ్, పీవీ నరసింహారావు, రాజన్న, భద్రాద్రి,  జోగులాంబ, కొమురం భీం పేర్ల ఖరారుపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే భూపాలపల్లికి ప్రొఫెసర్ జయశంకర్, సిరిసిల్లకు రాజన్న, గద్వాలకు జోగులాంబ, ఆసిఫాబాద్‌కు కొమురం భీం పేర్లు ఖరారు చేసినట్లు సీఎం ప్రకటించారు. మిగతా జిల్లాల పేర్లపై ఆలోచించాలని, తెలంగాణ ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రముఖుల పేర్లపై ఆలోచనలు చేయాలన్నారు.
 
ఎస్సీ గురుకులాలకు సీఎం కితాబు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ల విధానంపై పదేళ్ల నుంచి బాగా స్పందన వస్తోందని, రాష్ట్రానికి, గురుకులాలకు ఆదర్శంగా ఉన్న ఎస్సీ గురుకులాలను సీఎం అభినందించారు. మైనార్టీలు అధికంగా ఉన్నచోట ఎక్కువగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, వాటిని విజయవంతం చేయాలన్న అంశంపై చర్చించారు.

మైనారిటీ గురుకులాల కార్యదర్శి షఫీ ఉల్లాను సీఎం అభినందించారు. ఎస్సీ గురుకులాల సక్సెస్ వెనుక ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కృషి ఎంతో ఉందని, ఆయన బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అవసరమైతే  బీసీ,  గురుకులాలను ఆయనకే అప్పజెప్పాలన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తంచేశారు. బంగారు తెలంగాణ భవిష్యత్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లోనే ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు