ఈపీఎఫ్‌ సభ్యులకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ హౌసింగ్

24 Apr, 2017 02:52 IST|Sakshi
ఈపీఎఫ్‌ సభ్యులకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ హౌసింగ్

సాక్షి, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌(ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ) సభ్యుల కోసం ప్రత్యేకంగా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ హౌసింగ్‌ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ పథకం కింద వచ్చే రెండేళ్లలో 10 లక్షల మంది ఈపీఎఫ్‌ సభ్యులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఆదివారం ఇక్కడ ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, హడ్కోలతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు.

ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి సరైన స్థలాలు గుర్తించి వీలైనంత త్వరితంగా అప్పగించాలని కోరారు. పథకం కింద ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముందుకు రావాలని, ప్రత్యేక శ్రద్ధ చూపితే ఎక్కువ సంఖ్యలో గృహాలు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.2.2 లక్షల రాయితీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. గృహాలు నిర్మించుకునే ఈపీఎఫ్‌ఓ సభ్యులకు 90 శాతం మొత్తాన్ని రుణ రూపంలో ఇస్తామని వెల్లడించారు. ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో రూ.21,559 కోట్లు పెట్టుబడిగా పెట్టగా,  31 మార్చి 2017 నాటికి వాటి మార్కెట్‌ విలువ రూ. 23,845 కోట్లకు చేరిందన్నారు.

మరిన్ని వార్తలు