సీఎం.. ఒకప్పుడు నిర్వాసితుడే

12 Mar, 2018 02:29 IST|Sakshi

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

నిర్వాసితుల బాధలన్నీ ఆయనకు తెలుసు  

నిర్వాసితుల కాలనీ పనులకు శంకుస్థాపన

గజ్వేల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ముంపు బాధితుల కష్టాలు స్పష్టంగా తెలుసునని, ఒకప్పుడు సీఎం కూడా ఈ బాధను అనుభవించారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నగర పంచాయతీ పరిధి ముట్రాజ్‌పల్లిలో మల్లన్నసాగర్, ములుగు మండలం తునికి బొల్లారంలో కొండపోచమ్మ సాగర్‌ భూ నిర్వాసితుల కోసం నిర్మించతలపెట్టిన పునరావాస కాలనీల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఎగువ మానేరు నిర్మాణ సమయంలో కేసీఆర్‌ తండ్రి ఆ ప్రాంతం నుంచి చింతమడకకు వచ్చి స్థిరపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిర్వాసితుల బాధలు తెలిసిన సీఎం వారికి ఎలాంటి లోటు రానివ్వకుండా అన్నిరకాల వసతులు కల్పించాలని, దేశంలోనే అత్యున్నతమైన కాలనీల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ఆర్‌అండ్‌ఆర్‌ పథకం కింద ఆరు నెలల్లో అన్ని రకాల వసతులతో కూడిన కాలనీల నిర్మాణం చేపడుతామన్నారు.

ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి నేతృత్వంలో యంత్రాంగం రేయింబవళ్లు శ్రమించాలని ఆదేశించారు. నిర్వాసితుల త్యాగం వల్లే ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, వారి త్యాగానికి ప్రభుత్వం తరఫున ఎంత సాయం చేసినా తక్కువేనని అభిప్రాయపడ్డారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లలో మత్స్య సంపదపై నిర్వాసితులకు సర్వ హక్కులను కల్పిస్తామని ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన యువతను ఆదుకుంటామన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సభల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు