త్వరలో రామప్ప, లక్నవరానికి గోదావరి నీళ్లు

16 Mar, 2020 03:34 IST|Sakshi

ఎండిన వరికంకులు లేవు.. ఖాళీ బిందెలు లేవు..

ప్రజారంజక పాలనకు ఇదే నిదర్శనం: మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అనగానే ఎండిన మొక్కజొన్న జూళ్లు, ఎండిన వరి కంకులు, నీటి సమస్యకు చిహ్నంగా ఖాళీ బిందెలు, కరెంటు కోతలకు నిరసనగా కందిళ్ల ప్రదర్శనలు కనిపించేవి. కానీ కేసీఆర్‌ సీఎం అయ్యాక ఇలాంటివి కన్పించట్లేదు. ప్రజారంజక పాలనకు ఇదే నిదర్శనం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్‌ పద్దులపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్‌ తరఫున నీటిపారుదల శాఖపై ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏకంగా 38 లక్షల ఎకరాలు సాగుతో కళకళలాడటం తొలిసారి చూస్తున్నామని చెప్పారు. అద్భుతమైన రీతిలో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోటి ఎకరాలు సాగులోకి తెచ్చే దిశగా తెలంగాణ సాగుతోందన్నారు. ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్‌ కూడా తెలంగాణ ప్రాజెక్టులపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. త్వరలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప చెరువును గోదావరి నీటితో నింపుతామని, అక్కడి నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా అందిస్తామని తెలిపారు. వెరసి 8,700 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామని చెప్పారు.

లక్ష కోట్ల అవినీతి: కోమటిరెడ్డి
సాగునీటిపై హరీశ్‌రావు మాట్లాడుతుండ గా.. కాంగ్రెస్‌ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. భారీ అవినీతి జరిగినా, గొప్పగా పనులు జరిగాయంటూ చెప్పుకోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు.

కాంట్రాక్టర్ల బకాయిలు చాలావరకు తీర్చాం: ప్రశాంత్‌రెడ్డి
రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈసారి ఎక్కువ నిధులే కేటాయించుకున్నామని రోడ్లు భవనాలశాఖ మంత్రి  ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు భారీగా బిల్లుల బకాయిలున్న మాట నిజం కాదన్నారు. గతంలో ఎక్కువే ఉండేవని, కానీ ఆర్‌డీఎఫ్‌ ద్వారా రుణం పొంది వాటిని చాలా వరకు తీర్చేశామని చెప్పారు. లుంబినీ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలన్న సభ్యుల సూచనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

80 శాతం పూర్తయిన ‘భగీరథ’
రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకం 80% పూర్తయిందని, త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. మిషన్‌ భగీరథ పుణ్యాన ఇప్పుడు వేసవిలోనూ రాష్ట్రంలో తాగు నీటి సమస్య లు లేవన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే గోదావరి జలం ఇంటిలో నల్లా తిప్పగానే వస్తున్నందుకు అభినందించాల్సింది పో యి కాంగ్రెస్‌ నేతలు అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలో రాజగోపాల్‌ ను ఉద్దేశించి మంత్రి వాడిన ఓ పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిం చారు. అందుకు సారీ కూడా చెప్పారు.

మరిన్ని వార్తలు