హర్యానా వాసి ఇన్సూరెన్స్‌ ఫ్రాడ్‌..

4 Feb, 2020 10:07 IST|Sakshi

ఇన్సూరెన్స్‌ ఫ్రాడ్‌కు సహకరిస్తున్న హర్యానా వాసి అరెస్ట్‌

నగరానికి చెందిన యువతికి టోకరా  

సాక్షి, సిటీబ్యూరో: ఇన్సూరెన్స్‌ పాలసీల్లో బోనస్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలు అందించి సహకరిస్తున్న హర్యానా వాసిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఖాతాల్లో డిపాజిట్‌ అయిన డబ్బు డ్రా చేసి నేరగాళ్లకు అందించినందుకు గాను ఇతను 20 శాతం కమీషన్‌ తీసుకుంటున్నట్లు సీసీఎస్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి సోమవారం పేర్కొన్నారు. న్యూ ఢిల్లీకి చెందిన వినీత్‌ సింగ్‌ ప్రస్తుతం ఫరీదాబాద్‌లో ఉంటున్నాడు. వృత్తిరీత్యా జోయాటో డెలివరీ బాయ్‌గా పని చేసే అతను 2018లో ఢిల్లీలో నమోదైన ఓ దాడి కేసులో అరెస్టయ్యాడు. అప్పట్లో తీహార్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అతడికి అక్కడే ఓ నేరగాడితో పరిచయమైంది. సైబర్‌ నేరాలకు పాల్పడే వారికి అవసరమైన బ్యాంకు ఖాతాలు సమకూర్చడం అతడి పని. ఆన్‌లైన్‌ ద్వారా ఎర వేసి మోసాలు చేసే సైబర్‌ నేరగాళ్లు బాధితుల నుంచి డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడానికి తమ పేరుతో ఉన్న ఖాతాలు వాడరు. అలా చేస్తే పోలీసులకు చిక్కుతామనే ఉద్దేశంతో మధ్యవర్తుల ద్వారా కొందరు మనీమ్యూల్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు. వీరి ఖాతాలు వినియోగిస్తూ వీరికి కమీషన్లు ఇస్తూ ఉంటారు. అలాంటి మనీమ్యూల్స్‌లో వినీత్‌ ఒకడిగా మారి కర్ణాటక బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్, ఓరియంటల్‌ బ్యాంక్‌ల్లో ఖాతాలు తెరిచి వాటి వివరాలను సైబర్‌ నేరగాళ్లకు అప్పగించాడు. 

ఇన్సూరెన్స్‌ పేరుతో టోకరా
నగరానికి చెందిన ఓ యువతికి మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ అధికారిగా ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. బీమా ప్రీమియం రూ.59,511 ప్రతి ఏటా జనవరిలో తన యాక్సిస్‌ బ్యాంకు ఖాతా ద్వారా ఈమె చెల్లిస్తుండేది. అయితే ప్రైవేట్‌ బ్యాంక్‌ ద్వారా కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ద్వారా చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్‌ వస్తుందని, రూ.53,332 చెల్లిస్తే చాలంటూ చెప్పాడు. ఈ విషయం ఆమె నమ్మడంతో కర్ణాటక బ్యాంక్‌లో వినీత్‌ తెరిచిన ఖాతా నంబర్‌ ఇచ్చి అందులో డిపాజిట్‌ చేయమన్నాడు. ఆమె అలాగే చేయడంతో ఆ మొత్తం డ్రా చేసిన వినీత్‌ సైబర్‌ నేరగాడికి అప్పగించి కమీషన్‌ తీసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గత నెల 24న కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ వెంకటరామిరెడ్డి నిందితుడిని హర్యానాలో అరెస్టు చేశారు. పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా