కాళోజీ పేరుతో వరంగల్‌లో హెల్త్ వర్సిటీ

26 Sep, 2014 01:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాళోజీ పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కార్యాలయం గురువారం రాత్రి ప్రకటించింది.  కాకతీయ వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఈ సంస్థకు ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.‘కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్’ను వరంగల్‌కు మంజూరు చేస్తున్నట్టు  సీఎం కార్యాలయం ఈమేరకు ఒక సంక్షిప్త సందేశం ద్వారా వెల్లడించింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వైద్యవిద్య అడ్మిషన్లు, పరీక్షలను విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయమే నిర్వహిస్తోంది. కేసీఆర్ తాజా నిర్ణయంతో అడ్మిషన్ల ప్రక్రియ మినహా తెలంగాణ వైద్య, దంత, నర్సింగ్ కళాశాలలకు సంబంధించిన అంశాలన్నీ తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోకి రానున్నాయి. మెడిసిన్ అడ్మిషన్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నందున ఇకపై తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ కూడా అడ్మిషన్లలో భాగస్వామి కానున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశాలున్నాయని వైద్యశాఖవర్గాలు అభిప్రాయపడ్డాయి. సెప్టెంబర్ 30లోపు ఆరోగ్య విశ్వవిద్యాల య ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పలుమార్లు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణ రాష్ట్రం లో ప్రవేశపెట్టే నూతన ఆరోగ్య విధానంపై డిప్యూటీ సీఎం టి. రాజయ్య ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు నేడు చర్చించనున్నారు.
 ఇదిలాఉండగా, వరంగల్ జిల్లాలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య పలుమార్లు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 9 తేదీన వరంగల్‌లో జరిగిన కాళోజీ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రకటనలను ప్రస్తావిస్తూ, రాజయ్యను బహిరంగంగా మందలించారు. అయితే చివరకు సీఎం  వరంగల్‌కే తెలంగాణ హెల్త్‌వర్సిటీ మంజూరు చేయడం గమనార్హం.
 
 నా జన్మ ధన్యమైంది :  రాజయ్య
 వరంగల్ జిల్లాలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తన జన్మ ధన్యమైందని వైద్య,ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. గురువారం రాత్రి రాజయ్యను ‘సాక్షి ’ సంప్రదించగా ‘కేసీఆర్ ఆశీస్సులు, సహచర మంత్రులు, వరంగల్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంవల్లే ఇది సాధ్యమైంది. ఇదే కళాశాలలో చదువుకున్నాను. డాక్టర్‌గా ఇక్కడే ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు హెల్త్‌వర్సిటీ  ఏర్పాటు కావడం నా పూర్వజన్మ సుకృతం’ అన్నారు. ‘కాకతీయ వైద్య కళాశాలలో వెయ్యి పడకల ఆస్పత్రి ఉంది. 23 కోట్ల రూపాయలతో కొత్తగా పిల్లల విభాగం ఏర్పాటు కానుంది. పీఎంఎస్‌ఎస్‌వై కింద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం రూ. 150 కోట్లు మంజూరయ్యాయి. పైసాఖర్చు లేకుండా హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు భవనాలున్నాయి.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు