మీది కోర్టు ధిక్కారమే

29 Jun, 2018 02:56 IST|Sakshi

తెలంగాణ, ఏపీ విద్యుత్‌ సంస్థలపై హైకోర్టు ఆగ్రహం 

‘విభజన మార్గదర్శకాల’పై మా ఆదేశాలను అమలు చేయలేదు.. 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజన మార్గదర్శకాల రూపకల్పనకు 2 నెలల్లో కమిటీని ఏర్పాటు చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనని తెలంగాణ, ఏపీ విద్యుత్‌ సంస్థలకు హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కారానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చిచెప్పింది. వాదనలు విన్న తర్వాత ఎవరిది కోర్టు ధిక్కారమో తేలుస్తామని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు విద్యుత్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

కోర్టు ఆదేశాలు అమలు కాలేదు.. 
తెలంగాణ విద్యుత్‌ సంస్థలు తమను స్థానికత ఆధారంగా విభజించడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యల్లో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం, స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తీర్పునిచ్చింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్‌ కమిటీని కొనసాగించాలని, లేదా కొత్త కమిటీని రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను, విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది. విభజన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇప్పటికే రిలీవ్‌ చేసిన ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, విద్యుత్‌ సంస్థలు అమలు చేయడం లేదంటూ పలువురు ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. వీటి విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదని తెలిపారు.   

వివక్ష చూపొద్దని చెప్పాం 
తెలంగాణ విద్యుత్‌ సంస్థల తరఫు సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, ఆగస్టు 27న సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, తమ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందా అని ప్రశ్నించింది. లేదని ఉభయ పక్షాల న్యాయవాదులు చెప్పడంతో.. స్టే లేనప్పుడు సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లతో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘ ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మీరు (ఉభయ రాష్ట్రాలు, విద్యుత్‌ సంస్థలు) మా ఆదేశాలను అమలు చేయలేదని అర్థమవుతోంది. ఎలాంటి వివక్షకు తావు లేకుండా వ్యవహరించాలని మేం స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ధిక్కార పిటిషన్లను పరిశీలిస్తే మీరు (తెలంగాణ విద్యుత్‌ సంస్థలు) వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కోర్టు ధిక్కారమే’అని ధర్మాసనం స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు