ధిక్కరణ’పై నేడు హైకోర్టు నిర్ణయం

14 Aug, 2018 02:25 IST|Sakshi

అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసే విషయంపై విచారణ  

కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణ వ్యవహారంలో తీర్పు అమలు చేయనందుకు..

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు తీర్పును అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర సింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసే విషయంపై హైకోర్టు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ను శాసన సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్‌ శివశంకరరావు తీర్పునిచ్చారు.

తీర్పును అమ లు చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్‌ శివశంకరరావు మరోసారి విచారణ జరిపి కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశామని, తీర్పుపై స్టే కోరు తూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశా మని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వివరించారు.  కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత ఇద్దరు కార్యదర్శులు  అప్పీళ్లు దాఖలు చేశారని కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది తెలిపారు. జస్టిస్‌ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసే విషయంపై మంగళవారం నిర్ణయం వెలువరిస్తానని ప్రకటించారు. 

మరిన్ని వార్తలు