ముగిసిన వాదనలు.. రిజర్వ్‌లో తీర్పు

2 May, 2018 15:56 IST|Sakshi
కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌(పాత చిత్రం)

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల అనర్హత కేసు

సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల అనర్హత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. వేసవి సెలవుల అనంతరం తీర్పును వెల్లడించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ అన్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ల అనర్హత కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదని అభిషేక్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్‌ వేసే అర్హత లేదన్నారు.

ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ మాత్రమే పిటిషన్‌ వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శాసనమండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌పై కోమటిరెడ్డి, సంపత్‌ల దాడి ఆరోపణలకు సంబంధించి వీడియోలు సమర్పించడంలో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. అనర్హత కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ తరఫు న్యాయవాది వాదనలు ముగించగా, బుధవారం తదుపరి విచారణ కొనసాగించిన హైకోర్టు హైకోర్టు తీర్పు వెల్లడిని వాయిదా వేసింది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం?

మరిన్ని వార్తలు