మైక్రోసాఫ్ట్‌తో కలసి ఐటీ సేవలు

24 May, 2015 00:32 IST|Sakshi
మైక్రోసాఫ్ట్‌తో కలసి ఐటీ సేవలు

సీఎం కేసీఆర్‌తో హిటాచి బృందం భేటీ
స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌లో సహకారం

 
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సంస్థతో కలసి రాష్ట్రంలో ఐటీ ఆధారిత సేవలు అందించేందుకు హిటాచి అనుబంధ సంస్థ హిటాచి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఆసక్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో హిటాచి జపాన్, అమెరికా ప్రతినిధి బృందం వేర్వేరుగా శనివారం భేటీ అయ్యింది. సాధారణ ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో ఆన్‌లైన్‌లో ముఖాముఖి జరిపేలా స్మార్ట్ సిటీ సొల్యూషన్ రూపొందిస్తామని హిటాచి ప్రతినిధులు ప్రతిపాదించారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడంలో తమవంతు సహకారం అందిస్తామన్నారు.

పరిశ్రమల ప్రణాళిక, ఆరోగ్యం, విద్య, రవాణా, జైళ్లు, రక్షణ రంగాల్లో ఐటీ ఆధారిత సేవలు అందించేందుకు ఆసక్తితో ఉన్నట్లు హిటాచి బృందం వెల్లడించింది. ఒకే కార్డుపై వివిధ రకాల సేవలు అందించే ప్రతిపాదనపై ఆసక్తి చూపిన కేసీఆర్... సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో స్మార్ట్ సిటీ సొల్యూషన్ అవకాశాలను పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో భారీ యంత్ర సామగ్రి తయారీ ప్లాంటును నెలకొల్పాలని కోరారు. హిటాచి బృందంలో సీఈఓ, ఎండీ అనంత నారాయణన్, గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మైక్ గిల్లిస్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గ్యారీ పీటర్సన్‌తోపాటు మరో ఆరుగురు వున్నారు.

ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమల కార్యదర్శి అరవింద కుమార్, హెచ్‌ఎండీఏ ఎండీ శాలిని మిశ్రా తదితరులు సీఎం భేటీలో పాల్గొన్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగంలో నైపుణ్యం పెంపు, చిన్న పరిశ్రమలకు అవసరమైన ఐటీ సాంకేతికత అందించే దిశగా సహకారం ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు హిటాచి బృందాన్ని కోరారు. దీనిపై త్వరలో బ్లూప్రింట్ సమర్పిస్తామని హిటాచి ప్రతినిధులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు