ఇంటి బిల్లులకు వ్యవసాయ బకాయిలతో ముడి

26 Nov, 2014 23:29 IST|Sakshi

మోమిన్‌పేట: ‘మోకాలికి.. బోడి గుండు కు ముడిపెట్టినట్లు’ వ్యవహరిస్తున్నారు విద్యుత్ అధికారులు.. రైతుల వ్యవసా య బకాయిలను గృహ విద్యుత్ వినియోగానికి అధికారులు ముడిపెడుతున్నారు. వ్యవసాయ బకాయిల సర్‌చార్జి, ఇండ్ల విద్యుత్ బిల్లుకు జతచేసి చేతికి అందిస్తున్నారు. ఒక్కసారిగా వేలల్లో వచ్చిన బిల్లును చూసి రైతులు నివ్వెరపోతున్నారు. నిర్ణీత గడువులోపు ఈ బకాయిలు చేల్లించకుంటే గృహ విద్యుత్ కనెక్షన్లు కత్తిరిస్తామని అధికారులు చేస్తున్న హెచ్చరికలతో రైతులు లబోదిబోమంటున్నారు. అనావృష్టితో పంటలు నష్టపోయి కరువు కోరల్లో చిక్కి అల్లాడుతున్న ఈ తరుణంలో విద్యుత్ సిబ్బంది రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు.

 ఉచితమే..
 వ్యవసాయానికి 2004 నుంచి ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది. ఉచితం కదా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని రైతు మొదట భావించారు. అధికారులు మాత్రం నెలకు రూ.30లు సర్వీసు చార్జి చెల్లించాలని ప్రకటించారు. కానీ ఈ విషయం రైతులకు బోధపడలేదు. అధికారులు కూడా సరైన ప్రచా రం నిర్వహించలేదు. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు చెల్లించాల్సిన సర్వీసుచార్జిలను రైతులు చెల్లించలేదు. ప్రస్తుతం అవి తడిసి మోపెడయ్యాయి. ఏడాదికి రూ.360లు చెల్లించాలి.

చెల్లించలేని రైతులకు రూ.3600 కలిపి ఇంటి బిల్లుకు జోడిస్తున్నారు. రైతులకు ఆరు నెలలకోసారి రూ.180లు చెల్లించాలని బిల్లులు ఇవ్వాలి. ఈ విషయంలో విద్యు త్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలలకు ఇవ్వాల్సిన బిల్లు ఏడాదికి కూడా ఇవ్వలేదు. ఓవైపు రైతులు, మరోవైపు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పదేళ్లుగా సర్వీసుచార్జి కింద చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి.

 మండలంలో..
 మండలంలో ఆధికారికంగా వ్యవసాయ కనెక్షన్లు, ఇంటి సర్వీసులు కలిపి 10,673 ఉన్నాయి. వ్యవసాయ బకాయిలు రూ.38లక్షలు, ఇంటి బిల్లుల బకాయిలు రూ.2.50 కోట్లు, కేటగిరీ -7 కింద ప్రభుత్వ పాఠశాలల బకాయిలు రూ.3.5లక్షలకు పేరుకుపోయాయి.  ఇంటి బిల్లు, పదేళ్ల వ్యవసాయ బకాయిలు కలిపి ఏకమొత్తంలో చెల్లించాల్సి రావడంతో రైతులకు తలకు మించిన భారంగా మారింది. ఒక్కో రైతుకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు బిల్లులు చెల్లించాల్సి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు