ఇక ‘భద్రతా కార్డు’..!

12 Oct, 2014 02:08 IST|Sakshi

ఆదిలాబాద్ అర్బన్ : కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. అయితే రేషన్ కార్డు అనే పేరుకు బదులు ‘కుటుంబ ఆహార భద్రత కార్డు’ అని కొత్తగా పేరు తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ఇక ‘రేషన్ కార్డు’ లింకు తెగిపోనుంది. ఈ కార్డు స్థానంలో ‘కుటుంబ ఆహార భద్రత కార్డు’ రానుంది. ఇది కేవలం రేషన్ సరుకులు తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుకు బదులుగా ‘కుటుంబ అహార భద్రత కార్డు’ తెలంగాణ ప్రభుత్వం పేరిట జారీ కానుంది. ఇందులో భాగంగానే అర్హులైన ప్రజలందరికీ ‘ఆహార భద్రత కార్డు’ (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) ఇచ్చేందుకు ఈ నెల 15 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దీంతోపాటు అర్హులైన వారికి పింఛన్లు, కుల, ఆదాయ, విద్యార్థులకు సంబంధించిన ఇతర సర్టిఫికెట్లను ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఈ నెల 7న హైదరాబాద్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ముఖ్యకార్యదర్శుల సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ తగిన సూచనలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాకు మార్గదర్శకాలు అందాయి. ఇందులో భాగంగానే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది.

‘భద్రత కార్డు’ ప్రక్రియ ఇలా...
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ నిత్యావసర వస్తువులు అందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర కుటుంబ ఆహార భద్రతా కార్డు’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ కార్డు కోసం ప్రజలు గ్రామాల్లోని వీఆర్వోలకు, లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వీరిని ఈ ప్రక్రియ గ్రామ ఇన్‌చార్జీలుగా నియమించారు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుగా ఉండగా, ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున మొత్తం 1732 మంది అధికారులు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది.

ఈ నెల 15 వరకు ‘భద్రతా కార్డు’ దరఖాస్తులతో పాటు, పింఛన్లు, ఇతర తహశీల్దార్ ద్వారా జారీ చేయబడే సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారందరూ ఆహార భద్రతా కార్డులకు తెల్లకాగితంపై తమ వివరాలను రాసి సంబంధిత అధికారులు అందించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ కోరారు. వీఆర్వోలకు, కార్యదర్శులకు అందించిన దరఖాస్తులన్నీ గ్రామాల వారీగా విభజించి ఆహార భద్రతా కార్డు, పింఛన్లు, సర్టిఫికెట్ల దరఖాస్తులను వేరు చేస్తారు. ఇలా గ్రామాల వారీగా విభజించిన దరఖాస్తులను ఈ నెల 15 నుంచి పర్యవేక్షణ జరుపుతారు. ప్రతీ మండలానికి ఆరుగురు ప్రత్యేక అధికారుల చొప్పున పర్యవేక్షించేందుకు నియమించారు. వీరు వివిధ గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వయంగా సంబంధిత గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది.

ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్న తీరు.. అర్హులా.. కాదా.. అనేది తేల్చుతారు. ఒక వేళ ‘బోగస్’గా కూడా ఆహార భద్రతా కార్డు జారీకి అర్హులని గుర్తిస్తే ఈ ఆరుగురు అధికారులే బాధ్యులవుతారు. జిల్లా వ్యాప్తంగా 52 మండలాల్లో మండలానికి ఆరుగురు అధికారులు చొప్పున మొత్తం 312 మంది అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు ముఖ్యులుగా ఉంటారు.
 
ఇప్పటికే 85 వేల దరఖాస్తులు

జిల్లాలో ప్రస్తుతం 6,72,288 రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,617 చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉండడం.. పీడీఎఫ్ బియ్యం పక్కదారి పట్టడం వంటి వాటిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చేపట్టింది. ఇందులో 81,700 రేషన్ కార్డులను బోగస్‌గా గుర్తించి తొలగించారు. అయితే.. గతంలో చేపట్టిన రచ్చబండ, ప్రజాపథం కార్యక్రమాలు, ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.

రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 85 వేల మంది తమకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఈ దరఖాస్తులు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 7,78,613 కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 8,28,042 కుటుంబాలు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసి ఈపీడీఎస్ విధానం ద్వారా సరుకులు కేటాయిస్తున్నారు.
 
కొత్త కార్డులు ఇచ్చేందుకు...
- ఎం.జగన్మోహన్, కలెక్టర్

రేషన్ కార్డులకు బదులు తెలంగాణ ప్రభుత్వం కుటుంబ ఆహార భద్రతా కార్డును జారీ చేయనుంది. ఇందుకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మొదట గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. 15 నుంచి ప్రతి దరఖాస్తును మండల అధికారులు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోచ్చు. అర్హులందరికీ ‘ఆహార భద్రత కార్డు’లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తాం.

మరిన్ని వార్తలు