భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు

13 May, 2014 00:04 IST|Sakshi

సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సంగారెడ్డిలో సోమవారం  పోలీసులు భారీగా మోహరించారు. డీఆర్‌డీఏ, మహిళా ప్రాంగ ణం వద్ద లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ నేతృత్వంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలను ఆ రోడ్డుపై కాకుండా ఇతర దారుల్లోకి  మళ్లించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు వాహనాలను అనుమతించలేదు. లెక్కింపు కేంద్రాలకు కౌన్సిలర్ అభ్యర్థులను, వారి తరఫున నియమించిన ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించారు.

 ఓట్ల లెక్కింపు సందర్భంగా సీఐలు 10 మంది, ఎస్‌ఐలు 38, ఎఎస్‌ఐలు- హెడ్‌కానిస్టేబుళ్లు 49, కానిస్టేబుళ్లు 216, మహిళా కానిస్టేబుళ్లు 17, హోంగార్డులు 56, ఆర్‌ఎస్‌ఐలు ఇద్దరు, ఏఆర్‌ఎస్‌ఐలు-హెడ్‌కానిస్టేబుళ్లు 10, ఏఆర్ కానిస్టేబుళ్లు 60 మంది విధుల్లో పాల్గొన్నారు. డీఆర్‌డీఏ, మహిళా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను ఎస్పీ, ఎఎస్పీ ఆర్.మధుమోహన్‌రెడ్డి, సంగారెడ్డి డిఎస్పీ వెంకటేష్, డీఎస్పీ రాజేంద్ర, సీఐలు శివశంకర్ నాయక్, చెన్నకేశవులు తదితరులు పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు