‘దవా’ఖానాకు మరో వంద

11 Jan, 2020 02:44 IST|Sakshi
ఫైల్‌ఫోటో

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ నుంచి 

అందుబాటులోకి మరో వంద అత్యవసర మందులు

ఇందులో సీజనల్‌ ఇన్ఫెక్షన్లకు గురైన వారికి యాంటీబయోటిక్స్

గుండె, కిడ్నీ, లివర్‌ తదితర జబ్బులకు అప్‌డేటెడ్‌ ఔషధాలు

డెంగీ, స్వైన్‌ఫ్లూ, ఇతర రోగాలకు కొత్త యాంటీబయోటిక్స్‌ కూడా..

కొత్త ఔషధాలతో కలిపి మొత్తం 338 రకాల అత్యవసర మందులు

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం..  

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో కీలకమైన వ్యాధులకు అవసరమైన వంద రకాల అత్యవసర మందులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి పేదలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ఉన్న 238 రకాల అత్యవసర మందులతో కలిపి మొత్తం 338 రకాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. నూతన అత్యవసర మందులు వచ్చే ఏప్రిల్‌ నుంచి ఆసుపత్రులకు చేరతాయి. గుండె, కిడ్నీ, గ్యాస్ట్రిక్, అలర్జీ, థైరాయిడ్, డయాబెటిక్, ఇతర ఇన్‌ఫెక్షన్లు, జీవనశైలి తదితర జబ్బులకు అవసరమైన అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం వాడే అనేక మందులకు ప్రపంచవ్యాప్తంగా కొత్త రకాల మాలిక్యూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

ఆ మాలిక్యూల్స్‌తో అనేక కంపెనీలు అప్‌డేటెడ్‌ ఔషధాలను తయారు చేశాయి. మరోవైపు డెంగీ, చికున్‌ గున్యా, వైరల్‌ ఫీవర్లు, స్వైన్‌ఫ్లూ వంటివి రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. వాటిని నియంత్రించేందుకు అవసరమైన యాంటీ బయోటిక్స్‌ సహా పలు మందులనూ ఫార్మా కంపెనీలు తయారు చేశాయి. ఆయా రోగాలకు పాత మందులు పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కొత్త రకాల మాలిక్యూల్స్‌తో తయారైన అప్‌డేటెడ్‌ అత్యవసర మందులను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. 

కమిటీ నివేదిక మేరకు నిర్ణయం..
గతేడాది డెంగీ, చికున్‌గున్యా, వైరల్‌ ఫీవర్లు రాష్ట్రాన్ని వణికించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 వేల మంది డెంగీ బారిన పడినట్లు అంచనా. అయితే డెంగీ సీరియస్‌ అయితే దాన్ని లొంగదీసేందుకు అవసరమైన మందులు కానీ, యాంటీ బయోటిక్స్‌ కానీ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేవన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లో కీలకమైన గుండె, కిడ్నీ, ఇన్‌ఫెక్షన్లు తదితర వ్యాధుల నివారణకు అవసరమైన అత్యవసర మందులు పూర్తిస్థాయిలో పనిచేసేవి లేవన్న ఆరోపణలున్నాయి. అవే జబ్బులకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నాణ్యమైన, బ్రాండెడ్‌ మందులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చే రోగులు కూడా బయట మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొందరు రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే జబ్బు తగ్గడం లేదని భావించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి నయం చేయించుకుంటున్నారు.

దీంతో పేద రోగులకు ఆర్థికంగా భారమవుతోంది. ఈ పరిస్థితిపై వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఔషధాల కొనుగోలుపై ఏర్పాటైన కమిటీ గత కొన్ని నెలలుగా పరిస్థితిని అధ్యయనం చేసింది. అసలు ఏ మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి.. అవి పనిచేస్తున్నాయా లేదా.. ఇంకా ఫార్మా మార్కెట్లో కొత్త రకాలు ఏమున్నాయన్న దానిపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ మేరకు ఈ 100 రకాల కొత్త మందుల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటి కోసం త్వరలో టెండర్లు పిలిచి ఫార్మా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ నిర్ణయించింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరంలేని మందులు 200 రకాలున్నాయని గుర్తించారు. వాటిని నిలిపేయాలని నిర్ణయించారు. వాటిని వాడుతున్నా రోగం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
ముఖ్య రోగాలకు అవసరమైన అన్ని మందులు..
ప్రభుత్వ ఆసుపత్రులకు వివిధ రోగాలకు అవసరమైన అత్యవసర మందులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈసారి మందులు కొనుగోలు చేసేముందు టెండర్లలో పాల్గొనే ఫార్మా కంపెనీల తయారు చేసే ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేస్తాం. నాణ్యత ప్రమాణాలను తెలుసుకుంటాం. నిపుణుల కమిటీ నిర్ణయం మేరకు అత్యవసర మందులను కొనుగోలు చేస్తాం. ముఖ్యమైన రోగాలకు అవసరమైన అన్ని రకాల అత్యవసర మందులూ ఈ వంద రకాల్లో ఉన్నాయి. పేదల కోసం అత్యవసర మందులను కొనుగోలు చేస్తున్నాం.  – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ 

మరిన్ని వార్తలు