సాంకేతికతలో భేష్‌ అనిపించాలి 

13 Aug, 2018 01:27 IST|Sakshi
జూపార్కులో మొక్క నాటి నీళ్లు పోస్తున్న కేంద్ర మంత్రి హర్షవర్దన్‌. చిత్రంలో జోగు రామన్న

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్దన్‌

దేశంలోనే హైదరాబాద్‌ సీడీఎఫ్‌డీ కీలకం

వచ్చే పార్లమెంట్‌ సమావేశంలో డీఎన్‌ఏ బిల్లు

డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ నూతన భవనం ప్రారంభం  

సాక్షి, హైదరాబాద్‌: శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో భారత్‌ భేష్‌ అనిపించేలా పని చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్‌ (సీడీఎఫ్‌డీ) విభాగం పని చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నూతనంగా నిర్మించిన సీడీఎఫ్‌డీ భవనాన్ని హర్షవర్దన్‌ ఆదివారం ప్రారంభించారు. డీఎన్‌ఏ, ఫింగర్‌ ప్రింట్స్‌ గుర్తింపు, సమాచార సేకరణలో దర్యాప్తు సంస్థలకు సీడీఎఫ్‌డీ కీలకమని, దేశంలోని అన్ని దర్యాప్తు విభాగాలు ఉపయోగించుకునేలా పనిచేయాలని కోరారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి కేరాఫ్‌ అడ్రస్‌గా హైదరాబాద్‌ మారబోతోందని, అనేక కేంద్ర సంస్థలు ఇక్కడ ఏర్పాటవడం సంతోషకర పరిణామమని అన్నారు. దక్షిణ భారతదేశానికి ఉపయోగపడేలా సౌత్‌ విజ్ఞాన్‌ భవన్‌కు రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశామని, హైదరాబాద్‌ ఇప్పుడు దేశంలో కీలకమైన నగరమని అభిప్రాయపడ్డారు. 

వచ్చే సమావేశాల్లోనే డీఎన్‌ఏ బిల్లు 
వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో డీఎన్‌ఏ టెక్నాలజీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందుతుందని హర్షవర్దన్‌ తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిసారి ఏర్పడ్డప్పుడే డీఎన్‌ఏ టెక్నాలజీ బిల్లు రూపొందించామని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లోనే ఉందన్నారు. ఇటీవల ముగిసిన సమావేశాల్లో బిల్లును లోక్‌సభకు పరిచయం చేశామని, వచ్చే శీతాకాల సమావేశాల్లో డీఎన్‌ఏ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. డీఎన్‌ఏ బిల్లు ఆమోదం వల్ల అదృశ్యమైన చిన్నారుల కేసులు, సంచలనాత్మకమైన కేసుల్లో పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నామన్నారు. డీఎన్‌ఏ టెక్నాలజీ యాక్ట్‌లో ఆధార్‌ అనుసంధానం అంశం లేదని, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆధార్‌ను ఈ యాక్ట్‌కు అనుసంధానించే ఆలోచన కూడా తమకు లేదని వెల్లడించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, సీడీఎఫ్‌డీ డైరెక్టర్‌ మిత్రా, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, సీడీఎఫ్‌డీ మాజీ డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ల్యాకోన్స్‌ కృషి భేష్‌ 
సమన్వయంతో పనిచేస్తే ఎన్ని అద్భుతాలైనా సాధించవచ్చనేందుకు హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీ ఫర్‌ ద కన్సర్వేషన్‌ ఆఫ్‌ ఎండేంజర్డ్‌ స్పీషీస్‌ (ల్యాకోన్స్‌) నిదర్శనమని హర్షవర్ధన్‌ అన్నారు. అంతరించిపోతున్న అరుదైన జింక జాతిని ఆధునిక శాస్త్ర పద్ధతుల ద్వారా వృద్ధి చేయడం.. వాటిని మళ్లీ అడవుల్లోకి ప్రవేశపెట్టడం హర్షణీయమని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీలో ఆదివారం వన్యప్రాణి జన్యువనరుల కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ల్యాకోన్స్‌ వంటి కేంద్రాలను అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని విధాలుగా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

వన్యప్రాణి జన్యు వనరుల కేంద్రంలో ప్రస్తుతం 23 జీవజాతులకు సంబంధించిన జన్యువులు, కణజాలం అండాలను నిల్వ చేశామని, రానున్న మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్యను ఐదు రెట్లు ఎక్కువ చేసేందుకు ప్రయతిస్తున్నామని సీసీఎంబీ ల్యాకోన్స్‌ సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ కార్తికేయన్‌ వాసుదేవన్‌ ‘సాక్షి’కి తెలిపారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా మౌస్‌ డీర్‌ల సంఖ్యను పెంచగలిగామని.. ఇప్పటివరకూ అవి స్థానిక జంతు సంరక్షణాలయంలో ఉండగా.. దశల వారీగా వాటిని మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమ్రాబాద్, తదితర అటవీ ప్రాంతాల్లో వదిలేస్తామని ఆయన వివరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు