‘ట్రాఫికర్‌’కు చెక్‌ పెట్టాలి

16 Feb, 2020 09:02 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సూచించారు. అన్ని శాఖలు తగిన సమన్వయంతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. శనివారం జీహెచ్‌ఎంసీలో జరిగిన సిటీ కన్జర్వెన్స్‌  సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెచ్‌ఎంఆర్‌ మార్గాల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణ పనులు, సెంట్రల్‌ మీడియన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మార్గాన్ని జీహెచ్‌ఎంసీకి అప్పగించాలన్నారు.

ప్రమాదాల నివారణకు 40 కి.మీ.ల వేగపరిమితి సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖలు రోడ్డు కటింగ్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు సీఆర్‌ఎంపీ ఏజెన్సీలకు అందజేయాలన్నారు.రోడ్లు తవ్వకముందే యుటిలిటీస్‌ మ్యాపింగ్‌ తీసుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వాటర్‌లాగింగ్‌ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. భూసేకరణకు సంబంధించిన అంశాల్లో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. విద్యుత్‌ స్తంభాల తరలింపు ప్రక్రియ జాప్యం లేకుండా పూర్తిచేయాలని, చెట్ల కొమ్మలను నరికివేసేటప్పుడు ఎవరికీ ఇబ్బందిలేకుండా తగిన విధంగా ట్రిమ్మింగ్‌ చేయాలన్నారు.  కుడా అధికారులు ఏర్పాటు చేస్తున్న సివర్‌లైన్స్‌ శాస్త్రీయంగా లేవంటూ వాటిని ఏర్పాటు చేసేటప్పుడు జలమండలి అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

భూగర్భ పైప్‌లైన్ల లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని జలమండలి అధికారులను కోరారు.  చీకటి ప్రాంతాల్లో విద్యుత్‌దీపాలు ఈనెల 29వ తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు. మెట్రో అధికారులు పార్కింగ్‌ స్థలాలను గుర్తించి నోటిఫై చేయాలన్నారు. ఇన్‌సిటు విధానంలోని  డబుల్‌ బెడ్‌రూమ్‌ఇళ్ల  కేటాయింపులకు సంబంధించి పేర్లు, చిరునామా వంటి విషయాల్లో తప్పులున్నందున ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆధార్‌వివరాలతో సరిచూసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పథకాల  ఇళ్ల కేటాయింపుల  డేటాను ఆన్‌లైన్లో పొందుపర్చాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అప్‌డేట్‌చేస్తామన్నారు. 
 
రోడ్‌ సేఫ్టీకి ప్రత్యేక విభాగం ఉండాలి 
ట్రాఫిక్, రోడ్‌సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీసు అధికారులు సూచించారు.  రోడ్డు ప్రమాదాల మరణాల్లో 31 శాతం పాదచారులుంటున్నారని తెలిపారు. సెంట్రల్‌మీడియన్లలో గ్రిల్స్‌ ఎత్తు పెంచాల్సిందిగా హెచ్‌ఎంఆర్‌ అధికారులను కోరారు. చాలా ప్రాంతాల్లో.. ముఖ్యంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి మార్గంలో ఎక్కువమంది సెంట్రల్‌ మీడియన్లు దాటి వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు.బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించి, రీ  ఇంజినీరింగ్‌ చేయాలన్నారు. జలమండలి అధికారులు మాట్లాడుతూ తమ వాటర్‌ట్యాంకర్లకు కూడా జరిమానాలు విధిస్తున్నారనగా, అలాంటివి తమ దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి, జీహెచ్‌ఎంసీ  అడిషనల్, జోనల్‌ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు