చిన్నారుల మోముల్లో చిరునవ్వులు

16 May, 2019 07:42 IST|Sakshi
చిన్నారి కాలుకు పాదరక్ష తొడుగుతున్న సీపీ మహేష్‌ భగవత్‌

వలస కార్మికుల కుటుంబాల్లో విద్యా కుసుమాలు

వర్క్‌సైట్‌ స్కూళ్లు దేశానికే ఆదర్శం  

50 మంది పిల్లలకు ధ్రువీకరణ పత్రాల అందజేత  

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం: మహేష్‌ భగవత్‌

నేరేడ్‌మెట్‌: ‘సొంత రాష్ట్రం వెళ్లిన తర్వాత కూడా చదువులను కొనసాగిస్తాం.. మా మాతృభాష ఒడియాలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇసుక బట్టీల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలు సునీత, నమితలు అన్నారు. వేదికపై తడబడకుండా అధికారుల సమక్షంలో తమ మనసులోని భావాలను స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తం చేసిన తీరు సీపీ మహేష్‌ భగవత్‌తో పాటు ఇతర అధికారులను అబ్బురపరిచింది. మొన్నటి వరకు బాలకార్మికులుగా ఉన్న చిన్నారులు సీపీ మహేష్‌భగవత్‌ చొరవతో చదవుల తల్లి ఒడికి చేరారు. ఇటుక బట్టీల్లో పని చేసే వలస కార్మిక కుటుంబాల్లో విద్యా కుసుమాలు వికసించాయి. బుధవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఆపరేషన్‌ స్మైల్‌ కింద ఏర్పాటు చేసిన వర్క్‌సైట్‌ స్కూళ్లలో 2018–19 విద్యా సంవత్సరానికిగాను 1నుంచి 4వ తరగతి పూర్తి చేసిన ఒడిశా రాష్ట్రానికి చెందిన 50 మంది చిన్నారులకు ధ్రువీకరణ పత్రాలను సీపీ మహేష్‌ భగవత్‌ అందజేశారు. ఎండల్లో కాళ్లు కాలకుండా ఉండేందుకు పాదరక్షలను పంపిణీ చేశారు. సీపీ స్వయంగా ఓ చిన్నారి కాలుకు పాదరక్షలు తొడిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్‌ను బాలకార్మిక రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు బాలకార్మికులుగా మారకుండా వర్క్‌సైట్‌ స్కూళ్లను మూడేళ్ల క్రితం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ ఎన్‌జీఓ సంస్థ సౌజన్యంతో ఒడియా భాష బోధించే ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించినట్లు ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లలో సుమారు 2,194 మంది చిన్నారులు ప్రాథమిక విద్యను పూర్తి చేశారని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో 740 మంది 1 నుంచి 4వ తరగతి వరకు పూర్తి చేశారన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వర్క్‌సైట్‌ స్కూళ్లు దోహదపడతున్నాయని నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాస్‌ విద్యార్థి అన్నారని సీపీ గుర్తు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, ఇటుక బట్టీల నిర్వాహకుల భాగస్వామ్యం, సహకారంతోనే వర్క్‌సైట్‌ స్కూళ్లు విజయవంతంగా కొనసాగుతూ సత్పాలితాలిస్తున్నట్లు సీపీ వివరించారు. వచ్చే ఏడాది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వలస వస్తున్న కార్మికుల పిల్లల కోసం హిందీ భాషలో విద్యాబోధనకు స్కూళ్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అనంతరం వర్క్‌సైట్‌ స్కూళ్ల వలంటీర్లు, పోలీసులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో యాదాద్రి, ఎల్‌బీనగర్‌ డీసీపీలు నారాయణరెడ్డి, సన్‌ప్రీత్‌సిన్హా, అడ్మిన్‌ డీసీపీ శిల్పవల్లి, మేడ్చల్‌ డీఈఓ శారద, బొమ్మలరామారం ఎంఈఓ అంజయ్య, ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ ఎన్‌జీఓ సంస్థ డైరెక్టర్‌ డానియల్, రీజినల్‌ మేనేజర్‌ సురేష్, ఇటుక బట్టీల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పలువురు ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు