పోలీస్‌ హ్యాకథాన్‌

11 Jan, 2020 08:50 IST|Sakshi

రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహణ

స్టార్టప్స్, విద్యార్థులకు ప్రాధాన్యం

కేవీబీఆర్‌ స్టేడియం వేదిక  

18వ తేదీ నుంచి 36 గంటలు నిర్వహణ  

సాక్షి,సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనేతొలిస్థానంలో ఉన్న హైదరాబాద్‌ సిటీ పోలీసులు మరో వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భద్రతలో విద్యార్థులు, స్టార్టప్‌ కంపెనీలకు భాగస్వామ్యం కల్పిస్తూ తొలిసారిగా హ్యాకథాన్‌తలపెట్టారు. రాష్ట్రంలో ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇదేప్రథమమని పోలీసు అధికారులు చెబుతున్నారు. నగర అదనపు పోలీసు కమిషనర్‌ (నేరాలు) శిఖా గోయల్‌ సారథ్యంలో నిర్వహించే హ్యాకథాన్‌కు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కేవీబీఆర్‌) స్టేడియంవేదిక కానుంది. ఈ నెల 18 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నిర్వరామంగా 36 గంటల పాటు సాగుతుంది. ఇందులో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్టప్, విద్యార్థికి రూ.లక్ష ప్రైజ్‌ మనీగా ఇవ్వనున్నారు. చెన్నై, బెంగళూరు పోలీసులు గత ఏడాది నవంబర్‌లో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. నగర పోలీసు విభాగం ఇప్పటికే పలురకాలైన టెక్నాలజీలను వినియోగిస్తోంది. ప్రజల–పోలీసులకు వారధిగా హాక్‌–ఐ వంటి యాప్స్‌ సైతం అందుబాటులోకి తెచ్చింది. అయితే, సమాజంలో నేరాల తీరు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇలా అవసరమైన ప్రతిసారి పోలీసులు కొన్ని సంస్థలను సంప్రదించడమో, తమ వద్ద ఉన్న బృందాల సహకారం తీసుకోవడమో చేస్తుంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, బెంగళూరు పోలీసుల మాదిరిగా హ్యాకథాన్‌ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 

విద్యార్థులు, స్టార్టప్‌ సంస్థలకు మాత్రమే..
చెన్నై, బెంగళూరు పోలీసులు ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, ఐటీ పారిశ్రామిక వేత్తలు, రీసెర్చ్‌ స్కాలర్స్‌తో పాటు రక్షణ రంగానికి చెందిన వారికీ అవకాశం కల్పించారు. నగర పోలీసులు మాత్రం స్టార్టప్‌ ఇండస్ట్రీస్, సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులతో పాటు కార్పొరేట్‌ ఉద్యోగులను మాత్రమే ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. హ్యాకథాన్‌లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలుగా wehub.telangana.gov.in/hackathon.html వెబ్‌ పేజీ సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, వి–హబ్‌ వంటి సంస్థలు సహకరిస్తున్నాయి.

రిజిస్టర్‌ చేసుకున్న వారంతా హ్యాకథాన్‌కు హాజరై తమ ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త యాప్స్‌ను పోలీసుల ముందు ప్రదర్శిస్తారు. వీటిని పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. వీటిలో తాము గుర్తించిన లోపాలు, అవసరమైన మార్పుచేర్పులను సూచిస్తారు. వీటిని పరిగణలోకి తీసుకుని సదరు విద్యార్థి/స్టార్టప్‌ సంస్థ ఆయా మార్పులు చేసి తక్షణం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇలా ఎంపికైన వాటిలో మూడింటికి బహుమతులు అందిస్తారు. నగర పోలీసు విభాగంతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లాలు, యూనిట్స్‌కు చెందిన పోలీసులు ఈ హ్యాకథాన్‌ను సందర్శించనున్నారు. ఇందులో సైబర్‌ నేరాలతో పాటు మహిళలు–చిన్నారులపై జరిగే నేరాలు నిరోధించడం, కేసులను కొలిక్కి తీసుకురావడం, రోడ్డు భద్రత పెంపొందించడం–అవగాహన కల్పించడం, సోషల్‌ మీడియాపై నిఘా–నకిలీ వార్తల గుర్తింపు అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్టూడెంట్‌తో పాటు స్టార్టప్‌ కేటగిరీల్లో వేర్వేరుగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ విజేతల ఆలోచనలను అమలు చేయడంలో పోలీసు విభాగంతో పాటు ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలు సహకరించనున్నాయి.

ప్రధానంగా వీటిపైనే దృష్టి..
సైబర్‌ క్రైమ్‌: ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ ఫోరెన్సిక్‌వెరిఫికేషన్‌ టూల్స్, నకిలీ టూల్స్, యాప్స్‌ గుర్తింపు, నకిలీ వెబ్‌సైట్స్, పోర్టల్స్‌ గుర్తింపు
ఉమెన్‌/చిల్ట్రన్‌ సేఫ్టీ: ట్రాఫికింగ్‌ నిరోధం, వేళగాని వేళల్లో సంచరించే మహిళలకు రక్షణ, వర్క్‌ఫోర్స్‌హెరాస్‌మెంట్‌ నిరోధం, ఈవ్‌ టీజింగ్‌ నిరోధం,జీపీఎస్‌ టెక్నాలజీ వినియోగం, చైల్డ్‌ పోర్నోగ్రఫీనిరోధం, సోషల్‌ మీడియా–ఇంటర్‌నెట్‌పై నిఘా
రోడ్‌ సేఫ్టీ: ఇంటెలిజెంట్‌ పార్కింగ్‌ సిస్టం, ఫుట్‌పాత్‌ఆక్రమణల నిరోధం, ఉల్లంఘనల గుర్తింపు
సోషల్‌ మీడియా: నకిలీ వార్తల గుర్తింపు,మూలాలు కనిపెట్టడం

మరిన్ని వార్తలు