కాలిబాటలో కదిలే స్తంభాలు

8 Jun, 2018 09:24 IST|Sakshi
హైడ్రాలిక్‌ బోల్లార్డ్స్‌ నమునా చిత్రం

చార్మినార్‌ వద్ద హైడ్రాలిక్‌ బొల్లార్డ్స్‌ ఏర్పాటు  

రూ.2.38 కోట్ల పనులకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం 

ఫలక్‌నుమా వద్ద రూ.47.10 కోట్లతో ఆర్‌ఓబీ నిర్మాణం

సాక్షి, సిటీబ్యూరో : చార్మినార్‌ పరిసరాలను ముస్తాబు చేస్తున్న జీహెచ్‌ఎంసీ మరో అడుగు ముందుకేసింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం మాదిరిగా ఇక్కడ పాదచారులు తప్ప వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా ‘బొల్లార్డ్స్‌’(కదిలే స్తంభాలు) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. వివిధ మార్గాల నుంచి వచ్చి చార్మినార్‌కు చేరుకునే మార్గాల్లో వాహన నిషేధిత పాదచారుల జోన్‌లో వాహనాలు ముందుకు వెళ్లకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు.  ఇందులో భాగంగా స్థిరంగా ఉండేవి.. కదిలేవి(హైడ్రాలిక్‌)కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఫైరింజన్లు వంటి వాహనాలు ప్రయాణించేందుకు, వీవీఐపీలు వచ్చేందుకు అనువుగా భూమిలోకి వెళ్లిపోయేలా వీటిని బిగిస్తారు. స్థిరంగా ఉండే వాటితోపాటు హైడ్రాలిక్‌ బొల్లార్డ్స్‌ ఏర్పాటుకు రూ. 2.38 కోట్లు ఖర్చు కానుంది.

ఇందుకు స్టాండింగ్‌ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. పాదచారుల పథకంలో భాగంగా చార్మినార్‌ నాలుగువైపులా వాహనాల్ని నిషేధిస్తూ పాదచారుల జోన్‌ను గ్రానైట్‌ కాబుల్స్‌తో ప్రత్యేకంగా రూపొందించడం తెలిసిందే. వాహనాల నిరోధంతో పాటు వాయు కాలుష్యం లేకుండా చేసేందుకు బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కొంతకాలం క్రితం చార్మినార్‌ను సందర్శించిన మున్సిపల్‌ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ అధికారులకు సూచించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వద్ద బొల్లార్డ్‌లను ఏర్పాటు చేసిన అహ్మదాబాద్‌ కంపెనీని సంప్రదించారు. దాని కొటేషన్ల మేరకు రూ.2.38 కోట్లు ఖర్చు చేయనున్నారు.  

రూ.47.10 కోట్లతో ఆర్‌ఓబీ.. 
ఫలక్‌నుమా వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్‌ఓబీకి సమాంతరంగా మరో ఆర్‌ఓబీని నిర్మించేందుకు రూ.47.10 కోట్ల ప్రతిపాదనలకు సైతం స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్‌– ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్‌ మార్గంలో ఫలక్‌నుమా వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్‌ఓబీ అక్కడి రద్దీకి సరిపోవడం లేదు. దాంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం ఎంతోకాలంగా కోరుతున్నారు. అందుకు స్టాండింగ్‌ కమటీ ఆమోదం తెలిపింది. త్వరలో పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్లుగా పనిచేస్తున్న వారిని సర్కిల్‌ కమిషనర్లుగా రీ–డిజిగ్నేట్‌ చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేందుకు ఆమోదం తెలిపారు.  

మూడో సారీ అతడు.. 
ప్రస్తుత స్టాండింగ్‌ కమిటీ సమావేశం గడువు ముగిసిపోవడంతో పాటు కొత్త స్టాండింగ్‌ కమిటీ ఎన్నికను నామినేషన్ల గడువు కూడా గురువారంతో ముగిసింది. ఎప్పటిలాగే తొమ్మిది మంది టీఆర్‌ఎస్, ఆరుగురు ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వీలుగా ఆయా పార్టీల నుంచి నామినేషన్లు  దాఖలైనట్లు తెలిసింది. గడచిన రెండు స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న రామ్‌నగర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డి మూడో స్టాండింగ్‌ కమిటీకి నామినేషన్‌ వేసినట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడనే విషయం తెలిసిందే. నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. గురువారం సమావేశానికి మేయర్‌ రామ్మోహన్‌ అధ్యక్షత వహించగా కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, జోనల్, అడిషనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు