ముఖం చాటేసిన వలస ఓటర్లు..!

12 Apr, 2019 03:32 IST|Sakshi

పోలింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపని వైనం

 మండుతున్న ఎండల కారణంగానూ గ్రామాలవైపు తొంగిచూడని తీరు 

వారిని పోలింగ్‌ కేంద్రాలకు తేవడంలోనూ శ్రద్ధ చూపని పార్టీలు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికలను వలస ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. గడిచిన అసెంబ్లీ, సర్పంచ్‌ల ఎన్నికల వేళ ఓటు వేసేందుకు గ్రామాలకు పోటెత్తిన ఓటర్లు ఈ మారు ముఖం చాటేశారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీపెద్దగా పోలింగ్‌లో పాల్గొనేందుకు వారు కదల లేదు. పార్లమెంట్‌ ఎన్నికలు కావడంతో నియోజకవర్గ నేతలు పట్టింపు లేని ధోరణితో పాటు ఎండలు ఠారెత్తించడంతో వలస ఓటర్లు కీలకంగా ఉన్న పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తీవ్రంగా పడిపోయింది.  

ఆర్థికంగా భారమవుతుందనే... 
తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి సందడేదీ కనిపించలేదు. ఎక్కడా రోడ్లు కిక్కిరిసిపోలేదు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ లేదు. పార్లమెంట్‌ అభ్యర్థులెవరూ వలస ఓట్లు లక్ష్యంగా పనిచేయ లేదు. వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడం ఆర్ధికంగా భారమవుతుందన్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ దానిపై దృష్టి పెట్టలేదు. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు కొంత చొరవ చూపినా, నియోజకవర్గ నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను గ్రామాలకు తేవడంలో విఫలమయ్యారు. దీనికి తోడు ఎండల ప్రభావం కొంత పడింది. దీంతో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే మహబూబ్‌నగర్, జహీరాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, ఖమ్మం, మహబూబాబాద్‌ల పార్లమెంట్‌ల పరిధిలో పోలింగ్‌ శాతం పూర్తిగా పడిపోయింది.

నాగర్‌కర్నూల్‌లో 57.12 శాతం, మహబూబ్‌నగర్‌లో 64.99 శాతం, ఆదిలాబాద్‌ 66.76 శాతం, పెద్దపల్లి 59.24 శాతం, జహీరాబాద్‌లో 67.80 శాతం, ఖమ్మంలో 67.96 శాతం, మహబూబాబాద్‌లో 59.90 శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో పాటే గత ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాల్లో అధికంగా ఉన్న వలస కార్మికులను రప్పించడంలో ప్రధాన పార్టీలన్నీ పోటీ పడ్డాయి. ఉత్తర తెలంగాణలోని సుమారు 25 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గల్ఫ్‌ ఓటర్ల ప్రభావం బాగా ఉండటంతో ఆ దేశాలకు వెళ్లి మరీ వారిని రప్పించారు. కానీ ఈ ఏడాది ఏపార్టీ కూడా వారిని పట్టించుకోలేదు. దీంతో నిజామాబాద్‌ జిల్లాలో 54.20 శాతం పోలింగ్‌ మాత్రమే జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరిగిన చాలాచోట్ల అభ్యర్థుల జాతకాలు మారిపోగా, ఇప్పుడు తగ్గిన పోలింగ్‌ ఎవరి జాతకాలను మారుస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

అప్పుడు రద్దీ..ఇప్పుడంతా ఖాళీ..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ వలస ఓట్లే లక్ష్యంగా పనిచేశాయి. నియోజకవర్గ నేతలు వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారిని గ్రామాలకు రప్పించడంలో తీవ్రంగా శ్రమించాయి. వారిని రప్పించేందుకు వాహన, భోజన వసతిని కల్పించాయి. దీనికి తోడు హైదరాబాద్‌లో నివసిస్తున్న వలస ఓటర్లు స్వచ్ఛందంగా తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. దీంతో టోల్‌ప్లాజాలన్నీ వాహనాల రద్దీతో కిక్కిరిశాయి. ఒక దశలో ఈసీ జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం కదిలొచ్చి టోల్‌ వసూళ్లను రద్దు చేసింది. ఇక ఆర్టీసీ సైతం హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడిపింది.

రైళ్లు సైతం గ్రామాలకు తరలే ఓటర్లతో నిండాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తంగా 73.20 శాతం పోలింగ్‌ నమోదైంది. వలస ఓటర్లు అధికంగా ఉండే ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 85.99 శాతం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 79.42 శాతం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 82.04 శాతం, సంగారెడ్డి జిల్లాలో 81.94 శాతం, ఆదిలాబాద్‌ జిల్లాలో 83.37శాతం పోలింగ్‌ జరిగింది. తర్వాత జరిగిన సర్పంచ్‌ ఎన్నికల సందర్భంగానూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.  

మరిన్ని వార్తలు