వంద కోట్ల క్లబ్‌లో ‘రుద్రమదేవి’

9 Jan, 2016 01:43 IST|Sakshi
వంద కోట్ల క్లబ్‌లో ‘రుద్రమదేవి’

షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో దర్శకుడు గుణశేఖర్
 
హన్మకొండ : కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్రను తీసినందుకు గర్వంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు కాకతీయ మహారాణి నడయాడిన నేలపైనుంచి ప్రసంగిస్తున్నందుకు ఉద్విగ్నంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో హోరెత్తి పోయింది. రుద్రమాదేవి, తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే....

ఓరుగల్లు అనగానే ఓకే అన్నా..
ఇంటర్నేషన్ షార్ట్‌ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఆహ్వనం వచ్చిందని నాకు చెప్పగానే ఎక్కడా అని అడిగాను .‘ వరంగల్ ’.. అని చెప్పగానే వెంటనే ఓకే అన్నా. మూడు నెలలుగా ఎప్పుడెప్పుడు వరంగల్ వద్దామా అని ఎదురు చూస్తున్నా? నిర్వాహకులకు నేను ఫోన్ చేసి మరీ కార్యక్రమం కోసం వాకాబు చేశాను. రుద్రమాదేవి నడిచిన ఈ నేలలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ మరెన్నో ఫెస్టివల్స్‌కి నాంది కావాలి. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ తరహాలో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగాలి.
 
రికార్డు కలెక్షన్లు
 ఎంతో వ్యయప్రయాసల కోర్చి నేను రుద్రమదేవి చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. మొత్తం రూ.70 కోట్ల వ్యయమైంది. కానీ అంతర్జాతీయంగా తెలుగు, తమిళ్, మళయాలం, హిందీల్లో కలిపి ఈ చిత్రం వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. యూఎస్‌ఏలో మహేశ్, పవన్ కళ్యాణ్ చిత్రాల తరహాలో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. రుద్రమదేవి చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినందుకు నేను గర్వపడటం లేదు. నాకు సన్మానాలు, సత్కారాలన్నా ఇష్టం లేదు. కానీ రుద్రమాదేవి వంటి చిత్రాన్ని నిర్మించాను, దర్శకత్వం వహించాను అని చెప్పుకునేందుకు గర్విస్తా. రుద్రమదేవి కోసం మాట్లాడేందుకు నేను ఇక్కడికొచ్చా.

ఎందరో తెలుసుకుంటున్నారు
రుద్రమదేవి సినిమా తీస్తున్నాని తెలియగానే కథ గురించి తెలుసుకున్న తమిళ్, మళయాలం, హిందీ వాళ్లు ఆశ్చర్యపోయారు. రుద్రమదేవి కోసం మా వాళ్లకు తెలియాలి అంటూ డబ్బింగ్ హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత గూగుల్‌లో రుద్రమాదేవి, కాకతీయ కింగ్‌డమ్, ఓరుగల్లు  కోసం వెతుకుతున్నవారి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో రుద్రమదేవి మూడో స్థానంలో నిలిచింది.

కేసీఆర్‌కు అభినందనలు
ఏ ప్రాంతం వాడన్నది చూడకుండా రుద్రమదేవి సినిమా తీశానని చెప్పగానే నా భుజం తట్టి వినోదపన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చరి త్ర అంటే రేపటి దారిని చూపించే నిన్నటి వెలుగు. ఆనాడు చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన రుద్రమదేవి ఎన్నో చెరువులను తవ్వించారు. ఆ నాటి చరిత్రను గౌరవిస్తూ చెరువుల పునరుద్ధరణ పథకానికి మిషన్ కాకతీయ అని సీఎం కేసీఆర్ గారు పేరు పెట్టారు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ కాలంలో కూడా ఎనిమిది వందల ఏళ్ల కిత్రం కాకతీయులు అవలంభించిన పద్ధతి నేటి ప్రభుత్వాలకు స్ఫూర్తిని ఇచ్చిందంటే.. మాటలు కాదు.
 
పవర్ ఫుల్ మీడియా

 సినిమా అనేది పవర్‌ఫుల్ మీడియా. సినిమా రంగంలోకి ప్రవేశించేందుకు షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ అనేది మంచి ఫ్లాట్‌ఫాం. ఎంతోమంది షార్ట్‌ఫిలిమ్‌ల ద్వారానే ఎదిగి పెద్ద దర్శకులు అయ్యారు. మా కాలంలో దర్శకుడు కావాలంటే నిర్మాత, హీరోలకు కథలు చెప్పి, ఒప్పించి, మెప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ కెమోరాతో పనితనం చూపించి దర్శక అవకాశం పొందవచ్చు. ఇటీవల కాలంలో ఈ పద్ధతిలో ఎంతోమంది టాలీవుడ్‌లో దర్శకులయ్యారు.
 
ఇంకా ఎంతో ఉంది
రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు అనే ఒక సామెత ఉంది. అదే విధంగా ఓరుగల్లు నగరం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదు. రుద్రమదేవితో పాటు ఎందరో రాజులు ఉన్నారు. వీరందరి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇటలీకి చెందిన మార్క్‌పోలో చెప్పే వరకు మనకు రుద్రమదేవి గురించి ఎక్కువగా తెలియదు. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. అందుకోసం ప్రయత్నాలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా ఓరుగల్లుకు ప్రాచుర్యం రావాలి. అందుకే నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. తప్పకుండా ‘ప్రతాపరుద్ర - ది లాస్ట్ ఎంపరర్’ సినిమా నిర్మిస్తాను. మళ్లీ మళ్లీ వరంగల్‌కు వస్తాను.
 
 

మరిన్ని వార్తలు