మిస్‌ యూ ‘బాబు సాబ్‌’

5 Jul, 2019 12:11 IST|Sakshi
ఎలక్ట్రికల్‌ బ్యాటరీ కారులో కంపెనీని సందర్శించిన బి.కె.బిర్లా దంపతులు (ఫైల్‌)

సాక్షి, పాలకుర్తి(కరీంనగర్‌) :  ‘బాబు సాబ్‌’ బసంత్‌నగర్‌ పరిసర ప్రాంతంలో ఈ పేరు అంటేనే ఒక గౌరవం. కేశోరాం గ్రూఫ్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అధినేత అయిన బసంత్‌కుమార్‌ బిర్లాను స్థానికంగా అందరూ పిలుచుకునే పేరు బాబు సాబ్‌. గురువారం అనారోగ్యంతో బాబుసాబ్‌ మృతి చెందాడన్న విషయం తెలిసి బసంత్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతంలో సిమెంట్‌ పరిశ్రమను స్థాపించి దేశ వ్యాప్తంగా ఎన్నో వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు బాసటగా నిలిచిన గొప్ప వ్యక్తి బాబుసాబ్‌. పరిశ్రమను స్థాపించడమే కాకుండా కంపెనీ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు చాలా గ్రామాల్లో వందల సంఖ్యలో దేవాలయాలను నిర్మించారు.

మరో మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పిలవబడే రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిలో తనదైన  ముద్రవేసి ఎంతో మంది పేదల గుండెల్లో దైవంగా కొలువబడ్డ మహోన్నత వ్యక్తి బసంత్‌కుమార్‌ బిర్లా. అలాంటి వ్యక్తి మరణించడంతో స్థానికంగా తమ కుటుంబసభ్యుల్ని కోల్పోయామనే విధంగా స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కార్మికులతో పాటు కర్మాగారం ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న వారు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ బాబుసాబ్‌ను మననం చేసుకుంటున్నారు. గురువారం కేశోరాం సూపర్‌బజార్‌ గల షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బాబుసాబ్‌ మృతికి సంతాపం ప్రకటించారు. దీంతో పాటు కర్మాగారం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టాఫ్‌కాలనీలోని ఇండియా మిషన్‌ సెకండరీ పాఠశాలకు సెలవు ప్రకటించారు.    
ఆయన పేరు మీదనే.
ప్రస్తుతం బసంత్‌నగర్‌గా పిలవబడుతున్న ప్రాంతం గతంలో ఈసాలతక్కళ్ళపల్లిగా పిలువబడేది. 1969లో స్థానికంగా బసంత్‌కుమార్‌ బిర్లా కేశోరాం కర్మాగారాన్ని స్థాపించడంతో ఈ ప్రాంతానికి ఆయన పేరును పెట్టి బసంత్‌నగర్‌గా మార్చారు. దీంతో పాటు బసంత్‌నగర్‌ను ఆనుకుని కన్నాల గ్రామపంచాయతీలో గల ఓ కాలనీకి తన తండ్రి ఘనశ్యాందాస్‌ బిర్లా పేరు మీద జీడీనగర్‌ అని పెట్టారు.  ప్రస్తుతం జీడీనగర్‌ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. దీంతో పాటు పాలకుర్తి గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన శ్రీబుగ్గ రామలింగేశ్వరస్వామి పేర్లలోని అక్షరాలను కలిపి కేశోరాం అని కంపెనీకి పేరు పెట్టాడని, దీని ఆధారంగానే ఆయనకు దేవుడి మీద ఏ స్థాయిలో భక్తి ఉందో చెప్పవచ్చునని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

ప్రత్యేక విమానంలో బసంత్‌నగర్‌కు.. 
బసంత్‌కుమార్‌ బిర్లా ప్రతియేడు బసంత్‌నగర్‌ కేశోరాం సిమెంట్‌ కర్మాగారం పర్యవేక్షణకై ప్రత్యేక విమానంలో వచ్చేవారు. ఇందుకోసం బసంత్‌నగర్‌ గ్రామ శివారుతో పాటు, పెద్దపల్లి మండలం కురుమపల్లి గ్రామ శివారులోని దాదాపు వంద ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుని విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికొకసారి బిర్లా బాబు బసంత్‌నగర్‌ కర్మాగారానికి సందర్శించే వారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చేవారు. బసంత్‌నగర్‌ సందర్శనకు వచ్చినపుడు కర్మాగారంతో పాటు మైన్స్, ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన బుగ్గ రామస్వామి ఆలయం, స్టాఫ్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వరాలయం, శివాలయం, కేశోరాం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డెయిరీ ఫాంను సందర్శించి అందులోని గోవులకు పూజలు చేసేవారు. కానీ గత ఏడేళ్లుగా వయోభారంతో పాటు ఆరోగ్యం సహకరించని కారణంగా బీకే బిర్లా బసంత్‌నగర్‌కు రాలేదు. కేశోరాం కర్మాగారం నిర్వహణ బాధ్యతలను కూడా తన మనుమరాలైన మంజుశ్రీకి అప్పగించారు. 

నేడు సంతాప సభ 
బసంత్‌నగర్‌ కేశోరాం సిమెంట్‌ కర్మాగారంలో శుక్రవారం బసంత్‌కుమార్‌ బిర్లా సంతాప సభ నిర్వహించనున్నారు. ఈమేరకు కంపెనీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కోల్‌కత్తాలో బీకే బిర్లా అంత్యక్రియలు ముగిసిన అనంతరం సంతాపసభ నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు