రైతులపై వడ్డీ భారం నిజమేనా?

7 Dec, 2017 03:40 IST|Sakshi

ఉత్తమ్‌కుమార్‌ ఫిర్యాదుపై విచారణకు సర్కారు ఆదేశం

24 వేల దరఖాస్తులను జిల్లాలకు పంపిన వ్యవసాయ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీ పొందిన రైతులపై బ్యాంకులు వడ్డీ భారం మోపుతున్నాయంటూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిస్తోంది. వడ్డీ భారం పడ్డ 24,342 మంది రైతుల దరఖాస్తులను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. వాటిని ప్రభుత్వం వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్‌కు పంపింది. ఆయా దరఖాస్తులను వ్యవసాయ శాఖ జిల్లాల వారీగా పంపించింది.

ఉత్తమ్‌ పంపిన రైతు దరఖాస్తులపై క్షుణ్నంగా అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదిక పంపాలని జిల్లా అధికారులను వ్యవసాయ శాఖ ఆదేశించింది. జిల్లా వ్యవసాయాధికారులు ఆయా దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. వ్యవసాయాధికారులతో కలసి సంబంధిత బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఉత్తమ్‌ పంపిన ఫిర్యా దుల్లోని రైతులపై నిజంగానే వడ్డీ భారం పడిందా అనే కోణంలో విచారణ సాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అనేక మంది రైతులపై వడ్డీ భారం పడినట్లు తెలుస్తోందని ఆ శాఖ వర్గాల సమాచారం.
బ్యాంకులకు

సర్కారు బకాయి రూ.409 కోట్లు..
రైతులకు ఇచ్చిన రుణాలకు సంబంధించి పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల కింద ప్రభుత్వం బ్యాంకులకు రూ.409 కోట్లు బకాయి పడింది. వాటిని తీర్చడంలో సర్కారు వైఫల్యం కారణంగా అది రైతుకు శాపంగా మారిందని పేర్కొంటున్నారు. రూ.321 కోట్లకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్వో) జారీ చేసి డబ్బుల విడుదలలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీంతో ఆ సొమ్మును రైతుల నుంచే బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తం విడుదల చేస్తామని చాలా సార్లు ప్రభుత్వం బ్యాంకులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాన్ని 4 విడతలుగా మాఫీ చేయడంతో రైతులపై విపరీతమైన వడ్డీ భారం పడింది. బ్యాంకులో ఉన్న పట్టా పాసు పుస్తకాలను విడిపించుకునేందుకు వడ్డీని రైతులే భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో అనేక చోట్ల బలవంతంగా వడ్డీలు వసూలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం తమపైనే పడుతుండటం, రుణాలు ఇవ్వకుండా వేధించడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. 

మరిన్ని వార్తలు