జూనియర్‌ కాలేజీల్లో కౌన్సెలర్లు

30 Oct, 2019 01:47 IST|Sakshi

ఆత్మహత్యల నివారణకు ఇంటర్‌ బోర్డు చర్యలు.. కాలేజీ లెక్చరర్లకు సైకాలజిస్టులతో శిక్షణ

వారి ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇప్పించేందుకు కసరత్తు

చదువులో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు

స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై అందరికీ అవగాహన

ఫెయిలైన వారికి ప్రత్యేక శిక్షణ, అందుబాటులోకి ఆన్‌లైన్‌ పాఠాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు చర్యలు చేపడుతోంది. చదువులో వెనుకబడి పోతున్నామన్న ఆందోళనతో ఆత్మన్యూనతా భావానికి గురయ్యే విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు కసరత్తు చేస్తోంది. విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయిం చేలా, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేలా కౌన్సెలింగ్‌ ఇప్పించేందుకు చర్యలు చేపడు తోంది. ఇందుకోసం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కౌన్సెలర్లను నియమిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బయట నుంచి కాకుండా కాలేజీల్లో బోధించే లెక్చరర్లలో ఒకరిని కౌన్సెలర్‌గా నియమించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 404 మంది లెక్చరర్లకు త్వరలోనే సైకాలజిస్టులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సైకాలజిస్టుల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లెక్చరర్లు నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గేలా కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు.

ముందుగా ప్రభుత్వ కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తరువాత ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లోనూ అమలు చేసేలా చూడాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. సైకాలజిస్టుల ఆధ్వర్యంలో శిక్షణ పొందే లెక్చరర్లు కౌన్సెలర్లుగా నియమితులయ్యాక విద్యార్థులు ఒత్తిడి తట్టుకోవడం ఎలా అనే అంశాలతోపాటు పరీక్షల సూచనలు, సబ్జెక్టులను ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దానిపై మెమరీ టిప్స్‌ కూడా నేర్పించనున్నారు. స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో వీడియో లెక్చర్స్‌ను విద్యార్థులకు చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కాలేజీల్లో కలివిడిగా ఉండని విద్యార్థులను గుర్తించి వారు చదువులో ఎలా ఉన్నారన్న అంశాలను తొలుత పరిశీలించనున్నారు. వారు కలివిడిగా ఉండకపోవడానికి కారణాలను గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ తరువాత విద్యార్థులందరికీ స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టి బాగా చదువుకునేలా అవగాహన కల్పించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు.

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు..
చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. సెకండియర్‌ విద్యార్థులు ఎవరైనా ఒకవేళ ఫస్టియర్‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయితే ఆయా సబ్జెక్టుల్లో కోచింగ్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బాగా చదివే విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్‌ అడ్వాన్స్‌డ్‌ వంటి పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ శిక్షణను నవంబర్‌ 8 లేదా 9న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బోర్డు ప్రతి సబ్జెక్ట్‌లో స్పెషల్‌ కంటెంట్‌ను తయారు చేయించి వాటిని సీడీల్లో భద్రపరించింది. వాటిని త్వరలోనే అన్ని కాలేజీలకు పంపించనుంది. మరోవైపు ఆన్‌లైన్‌ పాఠాలను కూడా అందించే ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కాలేజీల్లోని విద్యార్థులు ఒకేసారి పాఠాలు వినేలా చర్యలు చేపడుతోంది. 

మరిన్ని వార్తలు